18 నిండిన వారంతా ఓటర్లు కావాలి!

  • డిసెంబరు 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
  • ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
  • యువత చేతి ఓటుతో దేశ భవిష్యత్తు మార్చవచ్చు
  • జనసేన డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించిన జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు కావాలని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు కోరారు. మంగళవారం పార్వతీపురం పట్టణంలోని జనహిత డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఓటు నమోదు కార్యక్రమంపై బూత్ స్థాయి బి ఎల్ వో స్థాయి అధికారి నుండి జిల్లా స్థాయి జిల్లా కలెక్టర్ వరకు అందుబాటులో ఉంచిందన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, అవగాహన సదస్సులు తదితర వాటి ద్వారా అవగాహన కల్పిస్తోందన్నారు. ముఖ్యంగా వచ్చే సంవత్సరం 2024 జనవరి 18 నాటికి ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు కావాలన్నారు. దీనికి బి ఎల్ వో నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ఆన్లైన్లో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. జనవరి 5వ తేదీన తుది జాబితా ప్రచురణ జరుగుతుంది. కాబట్టి యువత ఈలోపు ఓటరుగా నమోదు కావాలన్నారు. దీనికోసం 18 ఏళ్ళు నిండినట్టు వయస్సు ధృవీకరించే ధ్రువీకరణ పత్రం, ఆధార కార్డు, రెండు ఫోటోలు, తల్లి, తండ్రి ఓటరు కార్డు తదితర డాక్యుమెంట్లు సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. చదువుకున్న విద్యార్థులు దీనిపై అవగాహన పెంచుకొని వారి వారి గ్రామాలలో ఆయా ప్రాంతాల్లో ఎవరైనా ఓటరుగా నమోదు కాకపోతే వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అన్నారు. యువత చేతి ఓటుతో దేశ భవిష్యత్తును మార్చవచ్చన్నారు. నీతి, నిజాయితీ కలిగిన నాయకులను ఎంచుకునే అవకాశం ఓటు ద్వారా రాజ్యాంగం కల్పించిందన్నారు. కాబట్టి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు ఓటర్ గా నమోదు కావాలని అవగాహన కల్పించారు. దీనిలో భాగంగా ఓటరు నమోదుకు సంబంధించి విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.