వ్యాక్సిన్ ధ‌ర‌ల్లో వ్య‌త్యాసం ఎందుకు?: కేటీఆర్‌

క‌రోనా వ్యాక్సిన్ ధ‌ర‌ల్లో వ్య‌త్యాసంపై కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యాక్సిన్‌ను రూ.150కి, రాష్ట్రాలకు రూ.400కు సరఫరా చేస్తామని వ్యాక్సిన్‌ ఉత్ప‌త్తి కంపెనీ (సీరం) ప్రకటించడాన్ని ఆయన ఖండించారు.

ఒకే దేశం-ఒకే పన్ను (జీఎస్‌టీ)ను రాష్ట్రాలు అంగీకరించాయ‌ని, అలాంటప్పుడు ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఎందుకని ఆయ‌న ప్రశ్నించారు. వ్యాక్సిన్ల‌ కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని ప్ర‌ధాన మంత్రి కేర్స్ నిధుల‌ నుంచి భరించాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. దేశ‌మంతా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగాల‌న్న స్ఫూర్తికి అస‌లు కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తుందా? అని ఆయ‌న అనుమానాలు వ్య‌క్తం చేశారు. స‌బ్ కా సాత్ స‌బ్కో వ్యాక్సిన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.

కాగా, తెలంగాణ‌లోని మునిసిపాలిటీల్లో ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌కు తాము స‌మ‌ర్థంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కొన‌సాగించామ‌ని కేటీఆర్ తెలిపారు. 141 మునిసిపాలిటీల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ 95.55 శాతం పూర్త‌యింద‌ని, జీహెచ్ఎంసీలో 96.19 శాతం పూర్త‌యింద‌ని ఆయ‌న చెప్పారు. త్వ‌ర‌లోనే 100 శాతం పూర్త‌వుతుంద‌ని ట్వీట్లు చేశారు.