ప్లే ఆఫ్‌కు ఢిల్లీ -రాజస్తాన్‌పై 33 పరుగుల తేడాతో గెలుపు

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో ప్లే-ఆఫ్‌కు చేరుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (43; 32 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లు), హెట్‌మెయిర్‌ (28; 16బంతుల్లో 5ఫోర్లు) రాణించారు. లక్ష్యఛేదనలో రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 121పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (70; 53బంతుల్లో 8ఫోర్లు, సిక్సర్‌) ఒంటరి పోరాటం చేశాడు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆ జట్టు ప్లే-ఆఫ్‌కు చేరింది.
తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తొలినుంచి నెమ్మదిగానే ఆడింది. నాలుగో ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(8) క్లీన్‌బౌల్డయ్యాడు. చేతన్‌ సకారియా వేసిన తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్‌ పృథ్వీ షా(10) లివింగ్‌స్టన్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 21 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (24)తో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ముస్తాఫిజుర్‌ వేసిన 12వ ఓవర్‌లో పంత్‌ ఔటవ్వగా.. ప్రమాదకరంగా మారుతున్న శ్రేయస్‌ అయ్యర్‌(43)ను రాహుల్‌ తెవాటియా 14వ ఓవర్‌లో పెలివియన్‌కి పంపించాడు. అక్షర్‌ పటేల్‌ (12), లలిత్‌ యాదవ్‌ (15), రవిచంద్రన్‌ అశ్విన్‌(6 నాటౌట్‌)గా నిలిచారు. ముస్తాఫిజుర్‌, సకారియా రెండేసి, త్యాగి, తెవాటియాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన రాజస్తాన్‌ 17 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. సంజు(70), మహిపాల్‌(19) మినహా మిగతా బ్యాట్స్‌మన్లు నిరాశపరిచారు. నోర్జేకు రెండు, ఆవేశ్‌, అశ్విన్‌, రబడా, అక్షర్‌కు తలా ఒక వికెట్‌ దక్కగా.. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు లభించింది.