ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్.. ప్రతీ ఒక్కరికీ హెల్త్ ఐడీ కార్డ్

ఆయుష్మాన్ భారత్ రెండు కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించిందన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో ఆయుష్మాన్ భార‌త్ డిజిటిల్ మిషన్‌ ను ఆయన ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ప్ర‌తీ భార‌తీయుడికి డిజిట‌ల్ హెల్త్ ఐడీ కార్డుని ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు డిజిటల్ అయి ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడతాయని వివరించారు.

నూతన టెక్నాల‌జీ ఆధారంగా రోగుల సేవ‌ల గురించి ఆయుష్మాన్ భారత్… దేశ‌వ్యాప్త‌ంగా అన్ని హాస్పిటల్స్ కు వివరిస్తుందని చెప్పారు మోడీ. చికిత్స‌ను అందించ‌డంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లను ఈ డిజిట‌ల్ మిష‌న్ ప‌రిష్క‌రిస్తుంద‌ని తెలిపారు. సాంకేతికంగా బ‌ల‌మైన ఫ్లాట్‌ ఫామ్‌ తో సుల‌భ‌మైన వైద్య చికిత్స వీల‌వుతుంద‌న్నారు. ఆరోగ్య రంగంలో సౌకర్యాలను బలోపేతం చేసే ప్రచారం నేటి నుంచి కొత్త దశలోకి వెళ్తోందన్నారు మోడీ.

ఈ ఆయుష్మాన్ డిజిటిల్ మిష‌న్ వైద్య రంగ స‌దుపాయాల అంశంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని. మూడేళ్ల క్రితం ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని ప్రారంభిచామ‌ని.. ఇప్పుడు డిజిట‌ల్ మిష‌న్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.