రాష్ట్రానికి అప్పు ఇవ్వొద్దని కేంద్రమే చెప్తుంది

• బ్యాంకులను స్వయంగా హెచ్చరిస్తున్న దుస్థితి
• చెత్త పన్నులు వసూలు చేస్తూ చెత్త ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు
• రాష్ట్రంలో పాలన అత్యంత దయనీయంగా తయారయ్యింది
• ముద్దులు పెట్టుకుంటూ తిరిగితే ప్రజలు నమ్మి ఓటు వేశారు
• ఒక వర్గానికే న్యాయం.. రాజ్యాంగ విరుద్ద పాలన
• వేసవి రాక ముందే అప్రకటిత విద్యుత్ కోతలు
• బటన్ నొక్కి మూడు రోజులైనా చేదోడు అందలేదు
• పోలీసుల మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దౌర్జన్యం చేస్తున్నారు
• తెనాలి అభివృద్ధి మనందరి బాధ్యత
• ఒక విజన్ తో ముందుకు వెళ్దాం
• తెనాలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

పాదయాత్రలు చేస్తూ అందరికీ ముద్దులు పెట్టుకుంటూ తిరిగితే జనం నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చాక నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ముఖ్యమంత్రి నట్టేట ముంచారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. చివరికి చెత్తపై పన్నులు వసూలు చేస్తూ చెత్త ప్రభుత్వంగా పేరు సంపాదించారన్నారు. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారనీ, రాష్ట్రానికి అప్పు ఇవ్వొద్దని స్వయానా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం అందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. గురువారం తెనాలి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ మండల కమిటీలకు ఎంపికైన సభ్యులకు నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో పరిపాలన అత్యంత దయనీయంగా తయారయ్యింది. రాష్ట్రాన్ని అప్పుల సుడిలో ముంచేశారు. ఆర్ధిక పరిస్థితి ఊహించనలవికాని చందంగా ఉంది. 2014 రాష్ట్ర విభజన నాటికి రూ. 97 వేల కోట్లుగా ఉన్న అప్పులు కాస్తా ఇప్పుడు రూ. 6 లక్షల 72 వేల కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త, ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఇవ్వండి అంటూ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హెచ్చరిస్తుంది అంటే రాష్ట్రాన్ని ఎలాంటి దుస్థితికి తీసుకువచ్చారో అర్ధం అవుతుంది.

  • అడుగడుగునా అవినీతి

అప్పులు చేసి సంక్షేమం ముసుగులో మీరు ఇస్తున్న పప్పు బెల్లాలు అందరికీ సమంగా అందుతున్నాయా అంటే అదీ లేదు. మత్స్యకారులకు రూ. 10 వేలు ఇస్తుంటే వాలంటీర్లో, ఇంకో వ్యవస్థో అక్కడే రూ. 4 వేలు లాగేసుకుంటున్నారు. అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోంది. అసలు మీరు దేని కోసం అధికారంలోకి వచ్చారు. ఇందుకోసమేనా ప్రజలు మిమ్మల్ని అంత మెజారిటీ ఇచ్చి గెలిపించింది.

• ముఖ్యమంత్రి రోజువారీ సంపాదన తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది

రాష్ట్రంలో పరిస్థితులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయంటే తాగుబోతులు కూడా తిడుతున్నారు. మేము ఏం మందు తాగాలో చెప్పడానికి ఆయనెవరు? మా ఆరోగ్యం పరిస్థితి ఏంటి ? అతనమ్మే బ్రాండ్లు ఎందుకు తాగాలి అని అడుగుతున్నారు. ఈ వ్యాపారం మీద ప్రతి రోజు ముఖ్యమంత్రి ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది. సంక్షేమ పథకాలు కొంత మందికే అందుతున్నాయి. ఒక వర్గానికే న్యాయం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య, రాజ్యాంగ విరుద్దం.

• విద్యుత్ కోతలకు సిద్ధం కావాలని సకల శాఖల సలహాదారుడు
ముందే చెప్పారు

రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అంధకారంలోకి నెడుతున్నారు. మొన్న తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తుంటే కరెంటు ఉండడం లేదు అని చెబుతున్నారు. మూడు గంటలపాటు అనధికార పవర్ కట్ చేస్తున్నారు. భవిష్యత్తులో కరెంటు కోతలకు సిద్ధం అవ్వమని ప్రభుత్వ సకల శాఖల సలహాదారుడు అప్పుడే చెప్పేశారు. వేసవి రాకముందే పరిస్థితి ఇలా ఉంది అంటే ఎండలు ముదిరాక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. పవర్ కట్లతోపాటు మరో రెండు మూడు నెలల్లో విద్యుత్ ఛార్జీలు కూడా ఎవరూ ఊహించని స్థాయిలో పెంచేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ట్రూ అప్ ఛార్జీల పేరిట భారీగా వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఉంది. రైతు భరోసా కేంద్రాలు దళారీ వ్యవస్థలుగా మారిపోయాయి. విత్తనాల కొనుగోలు నుంచి ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు చూస్తే యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి. యూరియా బ్లాక్ మార్కెట్ అయిపోయింది. మహిళల్ని ఓటీఎస్ పేరుతో వేధిస్తున్నారు. కట్టకపోతే డ్వాక్రా పొదుపు మొత్తాల నుంచి లాగేసుకుంటామంటున్నారు. జగనన్న చేదోడు కార్యక్రమం అన్నారు. బటన్ నొక్కి అకౌంట్లలోకి డబ్బు వెళ్లిపోయిందన్నారు. ఎంత మంది అకౌంటల్లో జమ అయ్యింది. మూడు రోజులు గడచింది ఇప్పటి వరకు ఎవరికీ చేదోడు అందలేదు. ఈ నెల కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 15, 16 తేదీల్లో వచ్చాయి. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చెత్తపాలనగా గుర్తింపు తెచ్చుకున్నారు.

• అధికారంలోకి వచ్చాక బాధ్యతలు విస్మరించారు

సామాన్యులు, ఉద్యోగస్తులు ఎంతో నమ్మకంతో ఓటు వేసి మిమ్మల్ని గెలిపించారు. ఓటు వేయడం వారు చేసిన తప్పు కాదు. ప్రజలు విశ్వాసంతో గెలిపిస్తే ముఖ్యమంత్రి గారికి మాత్రం ప్రజల మీద విశ్వాసం లేదు. మొన్న ఆందోళనల సమయంలో ఉద్యోగులు చెప్పారు బటన్ నొక్కి ఒక్కొక్కరు వంద ఓట్లు వేశామని. వాళ్లకి మీరు ఏం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా వాగ్దానాలు ఇచ్చి రెచ్చగొట్టారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బాధ్యతను మీరు విస్మరించారు. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి వారిని ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు అదే పోలీసుల్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొక్కాలు పట్టుకుంటున్న పరిస్థితి. మీ నుంచి ప్రజలు కోరుకుంది ఇదేనా? ఒక మంత్రి సి.ఐ. కాలర్ పట్టుకుంటాడా? ఇదేం బరితెగింపు. ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజల అవసరాలు పట్టవా? ఆ విషయంలో ఆయన తండ్రి గారిని చూసి నేర్చుకోవాలి. నిత్యం ఉదయం ఇంటికి వచ్చిన వారిని కలిసి వారి అవసరాలు తీర్చే వారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లలో ఈయనగారు ఎవరికైనా కనబడ్డారా? ఆ మధ్య ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన అని వీధి వ్యాపారాలన్నింటినీ తరలించివేశారు. ప్రజలంటే మీకెందుకంత భయం. ఎందుకు ధైర్యంగా ప్రజల్లోకి రాలేకపోతున్నారు. మంత్రులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అన్నింటికీ ఒక్కరే మాట్లాడుతారు. సకల శాఖల సలహాదారు అన్నీ ఆయనే నడిపిస్తూ ఉంటారు.

• ప్రజలు మీ కులాన్ని చూసి ఓట్లేశారా?

మాట్లాడితే కులాల ప్రస్తావన తీసుకువస్తారు. కొన్ని కులాలు ఓట్లు వేయరంటూ కావాలని పక్కన పెడుతున్నారు. ప్రజలు మీకు కులం చూసే ఓట్లు వేశారా? కొన్ని గ్రామాల్లో జరిగిన సంఘటనల గురించి పోలీస్ అధికారులతో మాట్లాడితే.. ప్రతి అడుగులో సమాజాన్ని చీల్చే విధంగా ముందుకు వెళ్తున్నారు. అధికారంలో ఉన్నవారే అలా చేస్తుంటే సమాజం ఎలా కలసి ఉంటుంది. కావాలని కేసులు పెట్టించి వేధించడం ఏంటి? అసలు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించి ఉంటే మీరు ఉండే వారే కాదు. జనసేన పార్టీ కనబడకుండా ఉండడం కోసం స్థానిక ఎన్నికల ప్రక్రియ మొత్తం ఉద్దేశ్యపూర్వకంగా మూడు రోజుల్లో పూర్తి చేశారు. ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు వీర పోరాటం చేశారు. ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నిందో? గెలిచాక మా నాయకుల్ని పార్టీలు మారమని ఎలాంటి ఒత్తిళ్లు తెచ్చారో మాకు తెలుసు? అధికార పార్టీలో ఎమ్మెల్యేలకే దిక్కు లేదు ఎంపీటీసీలు ఏం చేస్తారు? శాసనసభ్యుడు ఒక్క రోడ్డు వేయించుకోలేని పరిస్థితి. సర్పంచుల నిధులన్నీ లాగేసుకున్నారు. మంత్రులు మాట్లాడలేకపోతున్నారు.

• అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది

రాజకీయ జీవితం కేవలం పదవుల కోసం కాదు. పదవులు ఆశించడంలో తప్పులేదు. మన ప్రయాణంలో ఎంత నిజాయతీ అన్నదే ముఖ్యం. మీ ప్రాంత అభివృద్ధికి ఎంత వరకు కట్టుబడి ఉంటారన్నది ప్రశ్నించుకోవాలి. మొన్ననే మహా నాయకులు దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆయనకు గుర్తింపు లేదు. ఎంత అన్యాయం. ముఖ్యమంత్రిగా పని చేసి సామాన్యుడిగా బతికిన వ్యక్తి. చివరి రోజుల్లో రేకుల షెడ్డులో నివసించారు. అలాంటి వారి వల్లే ఎంతో కొంత నిజాయతీ బతికి ఉంది. జనసేన పార్టీగా మన వరకూ మనం మన ప్రాంత అభివృద్ధి జరగాలి అన్న పట్టుదలతో పని చేస్తున్నాం. మొన్న మాచర్ల వచ్చే సందర్భంలో పల్నాడులో రహదారుల దుస్థితి చూస్తే బాధ కలిగింది. మన రాష్ట్రంలో అసలు అభివృద్ధి ఎక్కడ ఉంది? ఒకప్పుడు తాగడానికి నీరు లేక ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడిన నల్గొండ లాంటి చోట ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. నాయకత్వ లోపం వల్ల ఇలా అయిపోయాం.

  • పాలాభిషేకాలు చేశారు.. రోడ్డు మాత్రం పూర్తి కాలేదు

మన తెనాలి విషయానికి వస్తే.. జీవో వచ్చేసింది. మంగళగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు వచ్చేసిందన్నారు. పాలాభిషేకాలు చేయాలంటూ హడావిడి చేశారు. ఇప్పటి వరకు ఉన్న రహదారినే పూర్తి చేయలేదు. రాష్ట్రంలో చూస్తే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. మూడు సార్లు టెండర్లు పిలిచినా రోడ్లు వేసేందుకు ఎవ్వరూ ముందుకు రాని దుస్థితి. రహదారుల దుస్థితిని ముఖ్యమంత్రి గారికి తెలియచేసేందుకు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తే – హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టి రూ. 2 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. అప్పు దొరకగానే వేస్తామన్నారు. ఇప్పుడు జూన్ లో మొదలు పెడతామంటున్నారు. జూన్ లో వర్షాకాలం మొదలైతే రోడ్లు ఎలా వేస్తారు?

• తెనాలిలో ఒక విజన్ తో ముందుకు వెళ్లాం

గతంలో తెనాలిలో ఒక విజన్ తో ముందుకు వెళ్లాం. గుంటూరు లాంటి నగరంలో ఉండేవారు సైతం తెనాలి వచ్చి ఉండాలి అనుకునే విధంగా మార్చేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేశాం. తెనాలికి వ్యవసాయంతో మంచి పేరు తెచ్చిన వారు ఉన్నారు. అభివృద్ధి కోరే ఒక సామరస్య వాతావరణం ఉండేది. గడచిన పదేళ్లలో పరిస్థితులు చూస్తుంటే బాధేస్తుంది. అభివృద్ధి శిలా ఫలకాలకే పరిమితం కాకూడదు. 8 ఏళ్లలో ఒక్క కొత్త రోడ్డు వేశారా? ప్రజలు అంత మెజారిటీ ఇచ్చి గెలిపించింది ఇందుకేనా? అప్పట్లో ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ఎమ్మెల్యేగారి ఇల్లు చిరునామాగా ఉండేది. కొల్లిపర మండలంలో అభివృద్ధి చేసి చూపాం. గ్రీవెన్స్ ఏర్పాటు చేసి 21 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరించాం. ఎవరు ఓటు వేశారు వేయలేదు అన్న బేధం లేకుండా అందర్నీ సమంగా చూశాం. రూ. 100 కోట్లతో రక్షిత మంచినీటి పథక తెచ్చాం. 2050 వరకు నీటికి ఇబ్బంది లేకుండా అన్ని డివిజన్లకు కుళాయిలు వేశాం. కొల్లిపర మండలంలో భూగర్భ జలాల్లో ఫ్లోరోసిస్ గుర్తించి రూ.30 కోట్లతో ఆ మండలానికి రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేశాం. కేంద్రీయ విద్యాలయం తెచ్చాం.. రాష్ట్రంలో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ పెదరావూరులో ఏర్పాటు చేశాం. ఇప్పటి నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడమంటే ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి బూతులు తిట్టుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు. భారత దేశంలోనే తడి చెత్త పొడిచెత్త కేంద్రాన్ని తెనాలిలో ఏర్పాటు చేశాం. రూపాయి తీసుకోకుండా ఇంటింటికీ రెండు బక్కెట్లు ఇచ్చాం. గతంతో పోలిస్తే ఇప్పుడు నిధులు ఎక్కువగానే ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లకు చేరినా ఎందుకు సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారు. తెనాలి అభివృద్ధి మనందరి బాధ్యత. మీతో నేను నిలబడతాను. ఎవరైనా తెనాలిలో ఉన్న సౌకర్యాలు చూసి అంతా ఇక్కడికి రావాలనేలా ప్రయత్నం చేశాం. నిధులు సమకూర్చినా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడున్న వారు అంతా ధన దాహంతో ఇసుక లో, లిక్కర్లో దోచేస్తున్నారు. మళ్లీ తెనాలికి ఆ పండుగ వాతావరణం తీసుకువద్దాం. అభివృద్ధి సంక్షేమం రెండూ అందేలా చూద్దాం. ప్రతి ఒక్కరినీ కలిసి భవిష్యత్తులో శ్రీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మంచి నాయకత్వాన్ని రాష్ట్రానికి తేవాలి. ప్రజల కోసం నిజాయితీగా స్పందించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కొంత మంది అధికారం కోసం కుటుంబం కోసం పని చేస్తారు. ఆయన ఎంత కష్టపడితే మనం ఇలా కూర్చున్నాం. ఒక సంకల్పంతో పోరాట యాత్ర మొదలు పెట్టారు. పార్టీ నిర్మాణం సామాన్య విషయం కాదు.

  • వైసీపీకి భయపడొద్దు

శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉంటారు. మన జనసైనికులు, నాయకుల వల్లే ప్రజలు మనల్ని గుర్తించారు అని. ఎంతో మంది ధనవంతులు, ఎన్నో శక్తులు, ఎన్నో కుట్రలు పన్నారు. ప్రలోభాలకు గురి చేశారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా మన పార్టీకి ఆదరణ పెరిగింది. ఎవరూ అధైర్యపడవద్దు. వైసీపీనో, యంత్రాంగాన్నో చూసి భయపడకండి. వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతారు. ఈ రోజున మనం ఒక పట్టుదలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇంత నిజాయితీ గల నాయకత్వం ఏ పార్టీలో లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇవ్వడానికి పది సార్లు ఆలోచిస్తారు. ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఎన్నో వ్యవప్రయాసలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆర్ధిక మూలాలు దెబ్బకొట్టేందుకు ఆలోచన చేస్తోంది.శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికి వస్తే వెనక్కి తగ్గరు. దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల గురించి ఆలోచించి రూ. 5 లక్షల ప్రమాద బీమా, రూ. 50 వేల మెడికల్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు. జరగరాని సంఘటన జరిగినప్పుడు బాధలో ఉన్న సభ్యుల కుటుంబాలకు జిల్లా నాయకత్వం అంతా కలసి వెళ్లి నిలబడి మేమున్నాం అంటూ భరోసా ఇస్తున్నాం. అంత భారీ మెజారిటీ పెట్టుకుని సీఎం ఎందుకు ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నారు? మనకి మంచి నాయకత్వం ఉంది. సమష్టిగా పని చేసే కార్యకర్తలు ఉన్నారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా పాతే ఏర్పాటు చేసుకుందాం. ఈ నెల 21 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం మరోసారి చేపడదాం. పదవుల్లో ఉన్న ఏ పార్టీ చేయలేనిది పవన్ కళ్యాణ్ చేశారు. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం విషయంలో దయచేసి నాయకత్వాన్ని నమ్మండి.. మన నాయకుడు మన భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. మనం అధికారంలోకి రావాలి అంటే పట్టుదల కావాలి. వచ్చే ఏడాదికి బూత్ కమిటీలు ఏర్పడుతాయ”న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చేనేత వికాస విభాగం అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు సయ్యద్ జిలానీ, నయూబ్ కమాల్, బేతపూడి విజయ్ శేఖర్, వి.మార్కండేయబాబు, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.