వైసీపీ మూడేళ్ల పాలనలో ముప్పైఏళ్ల విధ్వంసం

  • వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు
  • సంక్షేమం పేరిట ప్రజల జీవితాలని సంక్షోభంలోకి నెట్టారు.
  • ప్రమాణస్వీకారం రోజు చేసిన వాగ్దానాలకే దిక్కులేదు 95% హామీలు నెరవేర్చామని ఎలా చెబుతారు?
  • రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారు.
  • అడబిడ్డలకు రక్షణ లేదు…అభివృద్ధి జాడలేదు.
  • కుల మతాల మధ్య చిచ్చు రగిల్చి ఆ మంటల్లో రాజకీయ చలి కాచుకోవాలని చూసారు.
  • గత ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితుల, మైనారిటీల, బీసీల, కాపుల వెన్ను విరిచారు.
  • ఎన్నో మాటలు తప్పారు…మరెన్నో మడమలు తిప్పారు… అందుకేనా సంబరాలు చేసుకుంటున్నారు.
  • ఒక్కఛాన్స్ ఇచ్చి చారిత్రక తప్పిదం చేసామన్న పశ్చాత్తాపంలో ప్రజలు.
  • వైసీపీ మూడేళ్ళ అసమర్ధ అరాచక పాలనపై నిప్పులు చెరిగిన జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి.

గుంటూరు, వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో రాష్ట్రంలో ముప్పైఏళ్ల విధ్వంసం జరిగిందని, అరాచక, అసమర్ధ, అనాలోచిత పాలనతో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చిన ఘనత వైసీపీ నేతలకే చెల్లుతుందని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. వైసీపీ మూడేళ్ళ పాలనపై ఆయన సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాట్లాడితే మాది సంక్షేమ ప్రభుత్వమని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన 95% హామీలను నెరవేర్చాం అంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా వాస్తవ పరిస్థితులు అలాగ లేవని విమర్శించారు. సామాజిక పింఛన్ 3000 చేస్తానంటూ, కరెంట్ చార్జీలను పూర్తిగా తగ్గిస్తాను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం రోజు చేసిన వాగ్దానాలకే ఇప్పటికీ దిక్కులేదని ధ్వజమెత్తారు. అమ్మ ఒడి, చేయూత లాంటి పథకాలకు కొత్త నిబంధనలు పెట్టి ఎంతోమంది అర్హులకు అవి రాకుండా చేసి మోసం చేశారన్నారు. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యాన్ని నిషేధిస్తాను అంటూ ఇచ్చిన మాట తప్పి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని వీటికి తోడు గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చారని దుయ్యబట్టారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారని , అందిన కాడల్లా అప్పులు చేయటంతో పాటూ రాష్ట్ర చారిత్రక సంపదనూ తెగనమ్ముతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిదని, గడిచిన మూడేళ్ళలో వేలాదిమంది అడబిడ్డలపై జరిగిన హత్యలు, అత్యాచారాలను గమనిస్తే రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను ప్రజల్ని రక్షించేందుకు కాకుండా ప్రతిపక్షాల అణచివేతకు, ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితుల, మైనారిటీల, బీసీల, కాపుల వెన్నుని తమ స్వార్ధ రాజకీయాల కోసం విరిచేశారని, అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని నవరత్నాల పేరిట తుంగలో తొక్కి వారికి భవిష్యత్ లేకుండా చేసారని విమర్శించారు. తమ అసమర్ధ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందన్న విషయాన్ని గడప గడపకి ప్రభుత్వంలో చవిచూసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల మధ్య కులాల కార్చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించటం దుర్మార్గమన్నారు. సామాజిక భేరీ అంటూ ఇప్పుడు మంత్రులతో చేస్తున్న బస్సు యాత్ర కూడా తుస్సు మందని ఎద్దేవా చేశారు. మంత్రులందరూ ఖాళీ కుర్చీలతో మాట్లాడి వెళ్లిపోతున్నారన్నారు. అన్ని వర్గాల వారికి కార్పొరేషన్లు మాత్రమే ఏర్పాటు చేసారని కనీసం కూర్చోటానికి కూడా కుర్చీలు కూడా ఇవ్వలేదని ఇదేనా సామాజిక న్యాయ భేరీ అంటే అని ప్రశ్నించారు. మూడేళ్ళుగా ప్రజలు సరిగ్గా పనుల్లేక అల్లాడుతున్నారని ఒకవైపు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో మరోవైపు పెంచిన విద్యుత్, బస్ చార్జీల ధరలతో పూటగడవని స్థితిలో నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క అంగుళం అభివృద్ధి జరగలేదు, ఆడబిడ్డలకు సరైన రక్షణ లేదు, వ్యవస్థలన్ని నిర్వీర్యం చేశారు , రైతుల్ని నట్టేట ముంచారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ మూడేళ్ళలో ఏమి సాధించారని వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ఆళ్ళ హరి ప్రశ్నించారు. ఒక్క చాన్స్ ఇచ్చి చారిత్రక తప్పు చేశామన్న పచ్ఛాత్తాపంలో ప్రజలున్నారన్నారు. నమ్మకం, నిజాయితీ, నిబద్దత, సేవానిరతి కలగలసిన పవన్ కళ్యాణ్ నాయకత్వం కోసం ప్రజలంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని, పవన్ కళ్యాణ్ మాత్రమే కునారిల్లిన వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగల సమర్థుడని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆళ్ళ హరి అన్నారు.