ఉల్లి దిగుమతులపై నిబంధనల సడలింపు: కేంద్రం

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఉల్లి దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లో ఉల్లి సరఫరాను పెంచడానికి డిసెంబర్‌ 15 వరకు దిగుమతులపై ఉన్న నిబంధనల్లో స్వల్ప సడలింపులు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘డిసెంబర్‌ 15 వరకు ఉల్లి దిగుమతులపై నిబంధనల్లో సడలింపులకు నిర్ణయించాం. అంతేకాకుండా మార్కెట్లో ధర పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని నిల్వ కేంద్రాల నుంచి ఉల్లిని మార్కెట్‌కు తెప్పించే ప్రయత్నాలు చేపట్టాం. ఖరీఫ్‌ పంట ద్వారా 37లక్షల టన్నుల ఉల్లి రావల్సి ఉంది. అది మార్కెట్లకు చేరుకుంటే ధరల పెరుగుదలను నియంత్రించవచ్చు’అని కేంద్రం తెలిపింది.