“ఏ ప్రోమిస్డ్ ల్యాండ్”.. ఒబామా బుక్ లో భారత్

అమెరికా ఖండంలో కాక బయట జన్మించి అమెరికాకు అధ్యక్షుడైన తొలి వ్యక్తి, మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా రాసిన పుస్తకం “ఏ ప్రోమిస్డ్ ల్యాండ్” విడుదలై.. ప్రపంచ దేశాలకు చదవడానికి అందుబాటులోకి వచ్చింది. ఇది తన ఆత్మకథాంశంలో భాగం. ప్రధానంగా, 2009 నుండి 2017 వరకూ అధ్యక్షుడుగా పరిపాలించిన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినప్పటికీ, ఇందులో అనేక బాల్యస్మృతులు, భావాలు, అనుభవాలు, అనుభూతుల సారాలను పొందుపరిచినట్లుగా కనిపిస్తోంది. మొట్టమొదటగా ఇంగ్లీష్ లో ప్రచురించగా.. ఆ పై అరబిక్ నుండి స్వీడిష్ వరకూ 24భాషల్లో అనువాదమై, ప్రచురణకు సిద్ధమైంది.. త్వరలో తెలుగు మొదలు వివిధ భారతీయ భాషల్లోనూ అనువాదమై, భారతదేశ పాఠకులకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రచురించిన పుస్తకం మొదటి భాగం మాత్రమే. సమీప కాలంలో, రెండవ భాగం కూడా సిద్ధమై మనముందుకు రానుంది.

ఒబామా తన అధ్యక్ష పదవీకాలంలో జాతిని నడిపించడంలో ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, వివిధ జాతుల విద్వేషాల మధ్య గాయమైన హృదయాలకు సాంత్వన చేకూర్చిన వైనం, ప్రజాస్వామ్యం అందరికీ అందేలా చూడడంలో పోషించిన పాత్రల గురించి నిజాయితీగా, ఉన్నదున్నట్టుగా చెప్పాలనే సత్ సంకల్పంతో ఈ పుస్తకం రాశాను, అని బరాక్ ఒబామా ట్విట్టర్ వేదికగా తన కవితా హృదయం, రచనా విధానం పంచుకున్నారు.

ఇందులో అనేక అంశాలు, విభాగాలు ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి, భారత, రామాయణాది ఉత్కృష్ట గాథల గురించి, మహాత్మాగాంధీ మొదలు మన్ మోహన్ సింగ్ వరకూ ప్రస్తుతించారు. బిజెపిపై విమర్శలు చేశారు. సోనియా,రాహుల్ గాంధీని వ్యంగ్యంగా వర్ణించారు.

ముఖ్యంగా భారతదేశం పట్ల అనిర్వచనీయమైన గౌరవాన్ని, భక్తిని, మహాత్మాగాంధీ పట్ల అపారమైన ఆరాధనా భావాన్ని వ్యక్తం చేశారు. యావత్తు భారత్ చరిత్రపై గొప్ప గౌరవాన్ని చాటిచెప్పారు. భారతదేశ చారిత్రక పరిణామాన్ని ఒక విజయగాథగా అభివర్ణించారు.

ఎన్నోవైరుధ్యాలు, వైవిధ్యాలు, యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాలు, అవినీతి కుంభకోణాలను భారత్ ఎదుర్కొన్నప్పటికీ, ఇంకా ఎదుర్కుంటూ సాగుతున్నప్పటికీ, ప్రపంచంలో భారతదేశం ఎంతో విజయవంతమైన దేశంగానే ఒబామా చూస్తున్నారు.

ఇటువంటి అనేక భావాలను ఈ పుస్తకంలో హృదయం పరచి పంచుకున్నారు. తన జీవితాన్ని, ఆలోచనలను ప్రభావితం చేసిన అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి నేతలు ఉన్నప్పటికీ, మహాత్మాగాంధీ తనను ప్రభావితం చేసిన తీరు శిఖరసదృశమని చెప్పుకుంటూ వచ్చారు. భారత్ పట్ల తనకు అమితమైన ఆకర్షణ కలగడానికి ప్రధానమైన కారకుడు మహాత్మాగాంధీ అంటూ, తన ప్రేమను చాటుకున్నారు.

గాంధీజీ అనుసరించిన సత్యనిష్ఠ, సత్యాగ్రహం, అహింసామార్గం, మతపరమైన ఐక్యత మొదలైన అంశాలు స్ఫూర్తినిచ్చి, తన పరిపాలనను నడిపించాయని అన్నారు. ప్రతి వ్యక్తికీ సమానమైన గౌరవం దక్కుతూ, ఆర్ధిక, సామాజిక, రాజకీయ ఫలాలు అందించాలి, అనే పట్టుదలను తనలో నింపింది గాంధీ విధానాలే అని వివరించారు.

అమెరికా ఖండంలో కాక, బయట జన్మించి, అమెరికాకు అధ్యక్షుడైన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. నల్లజాతీయుడుగా, తెల్లవారి నేలపై అధికార పీఠం కైవసం చేసుకున్నారు. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమేకాక, అధ్యక్షుడైన తొలినాళ్ళల్లోనే “నోబెల్ శాంతి” బహుమతిని సొంతం చేసుకున్నారు.

తన జాతి, తన నేల ఎదుర్కొన్న అవమానాలు,కష్టాలు, చేసిన పోరాటాలు,సాధించిన విజయాలు భారతదేశ స్వాతంత్ర్యపోరాటానికి దగ్గరగానూ, తెల్లవారి క్రౌర్యాన్ని చవిచూచి, ఎదిరించి, తిరిగి స్వేచ్ఛను పొందిన భూమిగానూ భారత్ పట్ల ఒబామాకు ప్రత్యేక గౌరవాన్ని నిలిపి ఉంటాయి. అందుకే, స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపిన మహాత్మాగాంధీ పట్ల అనిర్వచనీయమైన ఆరాధనా భావాన్ని తెచ్చిపెట్టి ఉంటాయి. తాను చిన్ననాడు మలేషియాలో ఉన్నప్పుడు విన్న రామాయణ, మహాభారత గాథలు, అందులోని దివ్యపురుషులు భరతభూమి పట్ల విశిష్టమైన అభిప్రాయాలను కలుగజేసి వుంటాయని ఈ పుస్తకం చెబుతోంది.