ప్రముఖ కవి దేవి ప్రియ కన్నుమూశారు

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ ఈ తెల్లవారు జామున కన్నుమూశారు.  దీంతో తెలుగు సాహిత్య లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దేవిప్రియ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చక్కటి కవిత్వాన్ని రాయగల దిట్ట. దళిత బహుజన సాహిత్యాన్ని ఎంతో ప్రేమించిన బహుజన ఉద్ధారకుడు. దేవిప్రియ అసలు పేరు ఖ్వాజా హుస్సేన్‌. ఈయన కలం నుంచి జాలువారిన కార్టూన్‌ కవితల ‘రన్నింగ్‌ కామెంట్రీ’ పాఠకలోకం మన్ననలు అందుకున్నాయి. ‘అమ్మచెట్టు’, ‘నీటిపుట్ట’, ‘చేప చిలుక’, ‘తుఫాను తుమ్మెద’, ‘సమాజానంద స్వామి’, ‘గరీబు గీతాలు’, ‘గాలిరంగు’, ‘గంధకుటి’ తదితర కవితా సంపుటిలతో పాటు పలు రేడియో, రంగస్థల నాటికలు, సినిమా పాటలు రచించారు. ‘గాలిరంగు’ కవితా సంకలనానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. 1980లో ‘అమ్మచెట్టు’ కవిత్వానికి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు, 1991లో ‘నీటిపుట్ట’ కవితా సంకలనానికి సినారె కవితా పురస్కారం, 2001లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం, 2013లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం అందుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న దేవిప్రియ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆంధ్రప్రభలో నిర్వహించిన రన్నింగ్ కామెంట్రీ శీర్షిక బహుళ ప్రజాదరణ పొందింది.