దేశంలోనే నంబర్‌ వన్‌గా హైదరాబాద్ కు అరుదైన గౌరవం

హైదరాబాద్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే ఉత్తమ నగరంగా  హైదరాబాద్ ఎంపికైంది. దేశంలో నివాసయోగ్యమైన, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో హాలిడిఫై.కామ్‌ జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యత్తమమైన నంబర్‌ వన్‌ నగరంగా నిలిచింది.

దేశంలోని అత్యత్తమ నివాసయోగ్య నగరంగా ఎంపిక చేయడంలో సాంస్కృతిక సమ్మేళనం ప్రాతిపదికన రూపుదిద్దుకున్న నగరాలపై సర్వే చేయగా.. ఆయా నగరాల్లో పటిష్ఠమైన అవకాశాలు, సదుపాయాలు, చక్కని రీతిలో ఆర్థిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు మొదలగు  అంశాలతో ఈ సర్వేను నిర్వహించారు. భారత్‌లో అత్యంత నివాస యోగ్యమైన, ఉపాధి కల్పించే నగరంగా హైదరాబాద్‌ను పేర్కొంటూ ప్రజలు పట్టం కట్టినట్లు సర్వే తెలిపింది. సెప్టెంబర్‌ నుంచి మార్చి వరకు హైదరాబాద్‌లో పర్యటించడానికి విశిష్టమైన కాలంగా సర్వేలో తేలింది. చారిత్రాత్మక కట్టడాలు ప్రపంచ ప్రఖ్యాత పర్యాటకుల దృష్టిని ఆకర్షించినట్లు తేలింది. హైదరాబాద్‌ పర్యాటక కేంద్రాల్లో చార్మినార్‌, గొల్కొండ కోట, రామోజీ ఫిల్మ్ సిటీ మొదలైనవి పర్యాటకుల దృష్టిని ఆకర్షించితీరుతాయి. హైదరాబాద్ నగరం శరవేగంగా దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా అభివృద్ధి చెందుతోందని, తెలంగాణలో పర్యటించే వారికి విశిష్ట గమ్యస్థానంగా సర్వేలో వెల్లడైంది.