వై జంక్షన్లోనే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలి

  • జనసేన బలిజ సంఘం నాయకుల డిమాండ్

పుంగనూరు బైపాస్ రోడ్డు వై జంక్షన్లోనే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని జనసేన బలిజ సంఘ నాయకులు జంగాల శివరామ్ రాయల్ హెచ్చరించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వై జంక్షన్ లో బలిజ సంఘం వారు విగ్రహం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో జరుగుతున్న హడావుడి బలిజలను ఏమార్చడానికే అనే విషయం తెలుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని మల్లికార్జున సర్కిల్ వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. వై జంక్షన్లోనే విగ్రహం ఏర్పాటు చేయాలని, విగ్రహ ఏర్పాటుకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదన్నారు.‌ మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలలోని బలిజ కులస్తుల అందరితో పాటు వివిధ బలిజ సంఘాల వారు చందాలు వేసుకుని పోగు చేసి సొమ్ము సుమారు 9 లక్షల రూపాయలు వరకు ఉందని, దానితో 15 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నామని వివరించారు. లక్షలాది మంది బలిజల సమ్మతితో వై జంక్షన్ నందు శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని బలిజలు అందరూ గ్రహించాలని కోరారు. సుమారు 200 సంవత్సరాల పాటు దక్షిణ భారత దేశాన్ని పాలించిన విజయనగరం సామ్రాజ్య చక్రవర్తులలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయారని, అలాంటి వ్వక్తి విగ్రహం వై జంక్షన్లోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ‌న్యాయవాది అమరనారాయణ, అడపా సురేంద్ర, జగదీష్, కుమార్, గ్రానైట్ బాబు పాల్గొన్నారు. ‌