33 మందిని మింగిన వైసీపీ ఇసుక దాహానికి ఏడాదిన్నర!

• అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడానికి ఇసుక మాఫియానే కారణమా..?
• విచారణ నివేదికలు బయటపెట్టని ప్రభుత్వం
• ప్రాజెక్టు గేట్లు సకాలంలో ఎత్తి ఉంటే ఇంత నష్టం జరిగేదా…?
• కారకులపై చర్యలు లేవు.. నిర్వాసితులకు న్యాయమూ లేదు

ఇసుక మింగేయాలనే అధికార పార్టీ నాయకుల తాపత్రయం 33 మందిని బలి తీసుకుందంటే అవి వైసీపీ హత్యలు కిందకు రావా..? ప్రాజెక్టు గేట్లను సకాలంలో ఎత్తే అవకాశం ఉన్నా, కావాలని ఆలస్యం చేసి అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయేటట్లు చేసిన వైసీపీ నాయకుల తీరు వికృత చేష్టల్లోకి రాదా..? అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన సంఘటనను విదేశీ మీడియా పరిశీలనకు తీసుకుంటే, దేశం పరువు పోతుందని ఏకంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చెప్పడం వైసీపీ పాలన వైఫల్యం కాదా..? ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగి సంవత్సరంన్నర అయింది. ఇప్పటికీ ప్రాజెక్టు పునర్నిర్మాణం, పునరావాసితులకు న్యాయం చేయడంపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కనీసం ప్రాజెక్టు తెగిపోయినపుడు నష్టం వాటిల్లిన ఇళ్లకు, పంటలకు, పశువులకు కూడా పరిహారం సరిగా చెల్లించలేకపోయింది.
• ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో వరదలకు తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం దక్కలేదు. 2021 నవంబరు 19న భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. సంఘటన జరిగి ఏడాదిన్నర అయినా నిర్వాసితుల వేదన తీరలేదు. ప్రాజెక్టు తెగపోయిన తర్వాత తీరిగ్గా ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. రెండు నెలల్లో ఇళ్లు నిర్మిస్తామని సీఎం ఇచ్చిన మాట నెరవేరలేదు. పునరావాసం ఇళ్లు కొండలు, గుట్టల్లో నిర్మిస్తున్నారు. అక్కడ కనీస వసతులు లేవు. ఇస్తున్న రెండు సెంట్ల జాగాలోనూ ఇప్పటి వరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది.
• 2021 నవంబరు 19వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో ప్రధాన డ్యాంపై ప్రవాహం ప్రారంభం అయింది. 18వ తేదీ సాయంత్రం 5 గంటలకే పై నుంచి ప్రవాహం చాలా అధికంగా ఉందని, చాలా తక్కువ సమయంలోనే ప్రాజెక్టు నిండిపోవచ్చని అధికారులకు సమాచారం అందింది. అయితే అప్పటికప్పుడు ప్రాజెక్టు గేట్లు ఎత్తితే కిందనే ఇసుక తవ్వుతున్న యంత్రాలకు, అలాగే రీచ్ లో నష్టం వాటిల్లుతుందని, కొందరు వైసీపీ నాయకులు గేట్లు ఎత్తవద్దని ప్రాజెక్టు అధికారులను ఆదేశించడంతోనే గేట్లు సకాలంలో ఎత్తలేదనేది అంతర్గత విచారణలో బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సమయంలో ఏం జరిగిందనేది కేంద్ర పెద్దలు కూడా పలు రకాలుగా విచారణ చేయించి, దీనిలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, వైసీపీ నాయకుల హస్తం ఉన్నట్లు నిర్ధారించుకున్నట్లు సమాచారం.
• డ్యాం కొట్టుకుపోవడానికి దారితీసిన కారణాలను రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించిన నివేదికను బయటపెట్టలేదు. ఎవరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 2021, నవంబరు 19న అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. చెయ్యేరు నదికి వచ్చిన భారీ వరదలతో తెల్లవారుతుండగా ప్రాజెక్టు తెగిపోయింది. చెయ్యేరు నదికి అనూహ్యంగా భారీగా వచ్చిన వరదనీరుకు తోడు పైనున్న పింఛా డ్యాం కట్ట తెగిపడటంతో ఒక్కసారిగా అన్నమయ్య ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి పడింది. మొత్తంగా 28 గ్రామాలు మునిగిపోయాయి. 33 మంది వరదల్లో మృతి చెందారు.
• ప్రాజెక్టు నిర్వహణ విషయంలో ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. ప్రాజెక్టులోని 5వ గేటు సకాలంలో ఎత్తకపోవడానికి గల అసలు కారణం ప్రభుత్వ తీరే అన్నది బయట పడింది. వరద పెరిగిన తర్వాత ఆలస్యంగా స్పందించిన అధికారులు నాలుగు గేట్లు ఎత్తిన తర్వాత 5వ గేటు ఎత్తలేకపోయారు. దానికి గతంలో ఉన్న మరమ్మతులే కారణం అని అధికారులు తేల్చారు. 5వ గేటు మరమ్మతుల కోసం గతంలోనే రూ.4 కోట్లు అవసరం అవుతాయని నివేదించారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్లనే ప్రాజెక్టు గేటు ఎత్తలేకపోయారని తేల్చారు.. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఆలస్యంగా ఎత్తడం, 5వ గేటు మొరాయించడంతో నీరు ప్రాజెక్టు మీదుగా ప్రవహించింది. ఇన్ ఫ్లో అధికంగా ఉండటంతో ఇరిగేషన్ అధికారులు ఏం చేయలేక చేతులెత్తేశారు.
• రెండు గంటల్లోనే నిండిపోయే అన్నమయ్య ప్రాజెక్టు డిశ్చార్జి కెపాసిటీ 2.17 లక్షల క్యూసెక్కులు అయితే ఒకేసారి ప్రాజెక్టులోకి 3.20 లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో ప్రవాహాన్ని తట్టుకోలేక అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది. 2021 నవంబరు 17 నుంచి భారీగా వర్షాలు వస్తే, 18వ తేదీ ఉదయం నాటికే ప్రాజెక్టుకు 10 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో అందుకుంది. అదే రోజు సాయంత్రం 42 వేల క్యూసెక్కులకు ప్రవాహం పెరిగింది. సాయంత్రం 6 గంటల తరువాత ఫ్లో మరింత పెరిగింది. 3.20 లక్షల క్యూసెక్కుల ఫ్లో కంటే ఎక్కువ వరద వచ్చింది. ప్రవాహం గంటగంటకూ పెరుగుతున్నా ప్రాజెక్టు గేట్లు ఎందుకు తెరవలేదు..? పరివాహాక ప్రాంత ప్రజలను అప్రమత్తం ఎందుకు చేయలేదు అన్నది ఇప్పటికీ పెద్ద సందేహం.
• ప్రాజెక్టు తెగిపోయే అవకాశం ఉండటంతో అర్ధరాత్రి 2 గంటల వేళ ప్రాజెక్టు లష్కర్ రామయ్య అత్యవసర హారన్ మోగించేందుకు వెళితే అదీ పనిచేయలేదు. దీంతో పక్కనే ఉన్న గ్రామ ప్రజలకు తన సెల్ ఫోన్ లో ఛార్జింగ్ ఉన్నంత వరకు నిరంతరాయంగా ఫోన్లు చేసి అప్రమత్తం చేశాడు. ప్రాజెక్టు అత్యవసర హారన్ ఎందుకు మూగబోయింది..? దీనికి గల కారణాలను వైసీపీ ప్రభుత్వం బయటపెట్టలేదు.
• అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత కొన్ని ఊళ్లకు అనూహ్యంగా నష్టం వచ్చింది. 3 పంటలు పండే భూములన్నీ ఇసుక మేటలయ్యాయి. వాటిని ఇప్పటి వరకు మళ్లీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. 2 వేల ఎకరాల్లో ఇప్పటికీ ఇసుక మేటలు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. ఏటికి ఆనుకొని ఉన్న భూములు కావడంతో కరకట్టలు బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినా మాకు వ్యవసాయం చేసుకునేందుకు అనువైన వాతావరణం ఉంటుందని వరద బాధితులు చెబుతున్నా, వాటికి సంబంధించిన నిధులు మాత్రం విడుదల కావడం లేదు. కరకట్టలను మళ్లీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయం అడవి కాచిన వెన్నెల అయిపోయింది.
•తాగునీటికి కటకట
• 2.38 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు బహుదా, పింఛా, మాండవ్య నదుల సంగమం అనంతరం చెయ్యేరు నదిపై ఉంటుంది. ఈ నది మీదనే ప్రాజెక్టు నిర్మించారు. రాజంపేట మున్సిపాలిటీ సహా 18 గ్రామాలకు తాగునీరు, 22,500 ఎకరాలకు సాగునీరు అందించే అన్నమయ్య ప్రాజెక్టు బందనగడ్డ గ్రామంలో 2001లో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఖరీఫ్ లో 13 వేల ఎకరాలకు, రబీలో 6,500 ఎకరాలకు, 3 వేల ఎకరాల స్థిర ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. అప్పట్లో రూ.60.44 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు తెగిపోయిన అనంతరం తాగునీటి, సాగునీటి సమస్యకు శాశ్వత ప్రత్యామ్నాయం వెతకలేకపోయారు. ఇప్పటికీ రాజంపేటతో పాటు ఇతర గ్రామాలన్నీ తాగునీటి కటకటలోనే ఉండిపోయాయి.