పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి: రామ్ తాళ్ళూరి

• కొత్తగూడెం ఎంఎల్ఎ కొడుకు వనమా రాఘవ పై వస్తున్న ఆరోపణలకు సంబంధించి విచారణ చేపట్టాలి. రామకృష్ణా ఆత్మహత్యకు ముందు వనమా రాఘవతో మాట్లాడిన ఆడియో రికార్డును విడుదల చెయ్యాలి.
• జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు తాళ్ళూరి రామ్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజా ప్రతినిధి ముసుగులో పౌర సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న వనమా రాఘవపై చట్టపరమైన విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తన తండ్రి కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పదవిని అడ్డం పెట్టుకుని అమాయక ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ చట్టపరంగా అతనిపై ఏ విధమైన చర్యలు తీసుకోక పోవడం అనేది ప్రభుత్వంపై అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి తమ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడి, తమ చావులకు కారణం వనమా రాఘవ అని లేఖ రాసినప్పటికీ నిందితుడిపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోక పోవడం శోచనీయం. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు వనమా రాఘవతో మాట్లాడిన ఆడియోను వెంటనే విడుదల చెయ్యాలి. గతంలో కూడా చాలా సందర్భాల్లో వనమా రాఘవపై పలు ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం వెనుక మతలబు ఏమిటో ప్రజలకు తెలియ జెయ్యాలి. ఇటీవల ప్రభుత్వ పరిపాలన పరమైన వ్యవహారాల్లో సైతం వనమా రాఘవ పెత్తనం ఎక్కువ అవుతుందని పలు మీడియా సంస్థలు బహిరంగంగా చెబుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీలో ప్రజాప్రతినిధులుగా చెలామణీ అవుతున్న శాసనసభ్యులను అడ్డు పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వనమా రాఘవ లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుని ప్రజలకు ప్రభుత్వపై విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి.ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు వారిపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్లూరి పిలుపునిచ్చారు.