ఆపత్కాలంలో కార్యకర్తలకు అండగా నిలిచేందుకే క్రియాశీలక సభ్యత్వం

• నిబద్దతగల జన సైనికుల్ని కోల్పోవడం బాధాకరం
• పొన్నూరులో జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన శ్రీ నాదెండ్ల మనోహర్
• రూ. 5 లక్షల చెక్కు అందచేత

కష్టంలో ఉన్న జన సైనికుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్న ధైర్యం నింపడమే క్రియాశీలక సభ్యత్వం లక్ష్యమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. అనుకోని పరిస్థితుల్లో జనసేన కుటుంబ సభ్యుడిని కోల్పోయినప్పుడు పార్టీ నుంచి ఒక భరోసా ఆ కుటుంబాలకు అందచేయడం గర్వించదగిన అంశమన్నారు. గుంటూరు జిల్లా, పొన్నూరుకు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ వల్లంశెట్టి సాయి భరత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం పొన్నూరులోని శ్రీ సాయిభరత్ కుటుంబ సభ్యులను మనోహర్ పరామర్శించారు. అతని తల్లిదండ్రులు శ్రీమతి సూర్యకుమారి, శ్రీ వల్లంశెట్టి శ్రీధర్ లను ఓదార్చారు. రూ.5 లక్షల బీమా చెక్కు అందచేశారు. జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ “పార్టీ కోసం తపించిన జనసైనికుడి ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధించే అంశం. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్న భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు జిల్లా నాయకత్వం మొత్తం కదిలి వచ్చాం. కుటుంబ సభ్యుడిని కోల్పోయినప్పుడు వారికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వడమే మా ఉద్దేశం. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా చేపడుతున్నాం. ఈ నెల 28వ తేదీ వరకు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో జనసైనికులంతా భాగస్వాములు కావాలి” అన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, అమ్మిశెట్టి వాసు, సయ్యద్ జిలానీ, విజయ్ శేఖర్, బండారు రవికాంత్, శ్రీమతి పార్వతినాయుడు తదితరులు పాల్గొన్నారు.