అజ‌య్‌మిశ్రాకు ఉద్వాసన చెప్పాలి: రాష్ట్రప్రతిని కోరిన కాంగ్రెస్‌ బృందం

 కేంద్ర హోం సహాయ మంత్రి అజ‌య్‌ కుమార్‌ మిశ్రాను తొలగించాలని, లఖింపూర్‌ ఖేరీ ఘటనపై ఇద్దరు సుప్రీం కోర్టు, లేదా హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తులతో స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కాంగ్రెస్‌ నేతల బృందం కోరింది.కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకó, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రులు ఎకె ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌లతో కూడిన బృందం బుధవారం రాష్ట్రపతిని కలసి ఈ మేరకు ఒక వినతి పత్రం అందజేసింది. అనంతరం రాష్ట్రపతి భవన్‌ వెలుపల రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖింపూర్‌ హింసాత్మక ఘటనకు సంబంధించిన అన్ని వివరాలనూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడి తండ్రి హోం శాఖ సహాయ మంత్రి అయినందున ఆయన పదవిలో ఉంటే, నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదని, ఆ దృష్ట్యా ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరామన్నారు. సుప్రీం కోర్టుకు చెందిన ఇద్దరు సిట్టింగ్‌ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలనే మరో డిమాండ్‌ను కూడా రాష్ట్రపతి ముందు ఉంచినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి అజరు మిశ్రా స్వయంగా తప్పుకోవాలి, లేదంటే ఆయనకు ప్రధాని ఉద్వాసన పలకాలి. నిందితులు అధికారంలో కొనసాగినంత కాలం లఖింపూర్‌ హింసాత్మక ఘటనలో బాధితులకు న్యాయం జరగదని రాహుల్‌ పేర్కొన్నారు.. లఖింపూర్‌ ఘటనపై ఈరోజే తాను ప్రభుత్వంతో మాట్లాడతానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు.