బెంగాల్ – అస్సాంలలో ప్రారంభమైన రెండో దశ పోలింగ్

పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో రెండో విడత పోలింగ్‌ గురువారం ప్రారంభమైంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో, 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 27న తొలి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బెంగాల్‌లో రెండో విడతలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతుండగా.. 171 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 75,94,549 మంది ఓటర్లు వారి భవితవ్యం నిర్ణయించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో 10,620 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఓటింగ్‌ జరిగే అన్ని ప్రాంతాలను సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఇక ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.