రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారంతా ప్రజాగళం సభలో పాల్గొనాలి: పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌, బొప్పూడి ప్రజాగళం సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని జన‌సేన‌పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం చిలకలూరి పేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించనున్న చారిత్రాత్మక ‘ప్రజాగళం’ బహిరంగ సభ ఏర్పాట్ల‌ను నాయ‌కుల‌తో క‌ల‌సి ప‌రిశీలించి వ‌చ్చిన బాలాజి శ‌నివారం ఆయ‌న కార్యాల‌యంలో విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే మూడు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయని, కుల, మతాలకు అతీతంగా ప్రజలు పొత్తును ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంద‌ని వివ‌రించారు. దుర్మార్గ పాలనను ఇంటికి పంపే సభ ఇద‌ని, ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉండ‌బోతుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో సామాన్యుడిని ఇబ్బందిపెట్టే పాలన సాగుతోందని, లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులాంధ్రగా మార్చారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వనరులు దోచుకున్నారు. అభివృద్ధిని అటకెక్కించారని మండిప‌డ్డారు. ప్రజాస్వామ్య పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, 175కి 175 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందన్నారు. చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. స‌భ‌కు హాజ‌య్యే ప్ర‌జ‌ల‌కు కావాల్సిన రవాణ, భోజనం, తాగునీరు వంటి అన్ని ఏర్పాట్లు చేశార‌ని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారంతా ప్రజాగళం సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.