సమంతపై అసత్య ప్రచారాలు చేసిన వీడియో, ఆడియోలన్నింటినీ తొలగించాలి

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించిన తర్వాత సోషల్‌మీడియాలో సమంతను టార్గెట్‌ చేస్తూ నెటిజన్లు విమర్శించారు. అయితే నెటిజన్ల తీరుకి సమంత ఘాటుగానే సమాధానమిచ్చింది. ఈ క్రమంలో కొన్ని పాపులర్‌ టీవీ, యూట్యూబ్‌ ఛానెళ్లు కూడా సమంతపై అసత్య ప్రచారాలు చేశాయి. ఈ నేపథ్యంలో అసత్య ప్రచారాలు చేసిన సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానెళ్లపై సమంత కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ త్వరగా చేపట్టాలని ఆమె తరపు న్యాయవాది కోరగా.. కోర్టు ముందు అందరూ సమానులే అని కూకట్‌పల్లి కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా, తమ వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ట్విటర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించిన తర్వాత పైన పేర్కొన్న టీవీ, యూట్యూబ్‌ ఛాన్నెళ్లలో అసత్య ప్రచారాలు చేసి సమంత పరువుకి నష్టం కలిగించేలా వ్యవహరించాయని న్యాయవాది పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఆడియోలన్నింటినీ తక్షణమే తొలగించాలని, సమంతకు బహిరంగ క్షమాపణ చెప్పేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే సమంత సెలబ్రిటీ కావడం వల్ల.. ఆమెతోపాటు, తన కుటుంబానికి కూడా పరువు నష్టం కలిగేలా వ్యవహరించకుండా అడ్డుకట్ట వేసేందుకు శాశ్వత ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.