రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయింపు

ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రాముడి విగ్రహం తల నరికి కోనేరులో పడేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలపై దాడుల పట్ల విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. అంతేకాదు, రామతీర్థం ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, రామతీర్థంలోని ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.3 కోట్లు కేటాయిస్తున్నట్టు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 23న జరిగే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవానికి ముందే నూతన రథాన్ని సిద్ధం చేస్తామని వెల్లడించారు. నూతన రథానికి వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారం సంప్రోక్షణ నిర్వహిస్తామని వివరించారు. ఫిబ్రవరి 11న సంకల్పం, 12న ఆదివాసం, 13న అభిషేకం, పూర్ణాహుతి, రథ ప్రతిష్ట, ఫిబ్రవరి 23న కల్యాణోత్సవం, రథోత్సవం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. కొన్నాళ్ల కిందట అంతర్వేది క్షేత్రంలో రథం దగ్ధమైన సంగతి తెలిసిందే.