వర్క్‌ ఫ్రం హోమ్‌ గడువు పెంచిన అమెజాన్‌

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ వాణిజ్య దిగ్గజం అమోజాన్‌ తన ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హొంను పొడిగించింది. గతంలో జనవరి 2021 వరకు ఈ ఆప్షన్ ఇచ్చింది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఆ ఆప్షన్‌ను జూన్ 30, 2021 వరకు పొడిగిస్తూ ఉద్యోగులకు మెయిల్ చేసింది. ‘ఇంటి నుంచి సమర్థవంతంగా పనిచేయగలిగే ఉద్యోగులు దీనిని స్వాగతించారు’ అని అమెజాన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

అమెరికాలోని అమెజాన్ ఉద్యోగులు 19 వేల మందికి పైగా కరోనా భారినపడ్డారు. దాంతో సంస్థ వర్క్ ఫ్రం హోం ఆప్షన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆప్షన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థలలో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆఫీస్‌కి వచ్చే వారి కోసం శారీరక దూరం, శానిటైజేషన్, ఉష్ణోగ్రత తనిఖీలు, ఫేస్ కవరింగ్ మరియు హ్యాండ్ శానిటైజర్‌ వంటి వాటిని సిద్ధంగా ఉంచినట్లు అమెజాన్ ప్రతినిధి చెప్పారు.