సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో అమిత్ షా

స్వాతంత్య్రం అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను, ఆయన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నాలు జరిగాయని.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహమే.. మారిన వాస్తవాలకు ఉదాహరణ అంటూ అమిత్ షా తెలిపారు. దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఘనంగా నివాళులర్పించారు. ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ సందర్భంగా అమిత్ షా గుజరాత్‌లోని కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్దకు చేరుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. స్వాతంత్ర్యం తర్వాత, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషికి తగిన గౌరవం లభించలేదని అమిత్ షా పేర్కొన్నారు.

సర్దార్ పటేల్ కు భారతరత్న ఇవ్వలేదని.. ఆయన సేవలకు సరైన గౌరవవద ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పడు ఆ పరిస్థితి మారిందంటూ షా పేర్కొన్నారు. దేశాన్ని విడొగట్టాలనే బ్రిటిష్ వారి కుట్రలను పటేల్ విఫలం చేసి, అఖండ భారత్ నిర్మాణానికి కృషి చేశారని పటేల్‌ను అమిత్ షా కొనియాడారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న బ్రిటిష్ వారి కుట్రలను భగ్నం చేసి.. పటేల్ నవభారత నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. కెవడియా కేవలం ఒక ప్రాంతానికి పెట్టిన పేరు కాదని, జాతీయ ఐక్యత, దేశభక్తి మందిరమని అమిత్ షా పేర్కొన్నారు.

ఇక్కడ నిర్మించిన పటేల్ విగ్రహం భారత ఉజ్వల భవిష్యత్తును ప్రపంచానికి చాటిచెబుతోందంటూ పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను ఏ ఒక్కరూ నష్టపరచలేరంటూ షా స్పష్టంచేశారు. అయితే.. స్వాతంత్ర్యం తరువాత దురదృష్టవశాత్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకాలను తెరమరుగు చేసే ప్రయత్నం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. పరిస్థితులు మారాయని, ఆ తర్వాత ఆయనకు భారతరత్న ఇచ్చారని, దీనికి ఉదాహరణగా ప్రపంచంలోనే అతిపెద్దదైన విగ్రహం మన కళ్ల ముందే ఉందంటూ అమిత్‌షా పేర్కొన్నారు.