రైతులను చర్చలకు ఆహ్వానించిన అమిత్ షా

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌ బంద్‌ విజయవంతంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో బుధవారం జరగాల్సిన ఆరో విడత చర్చలకు ఒక రోజు ముందు రైతులను హోంమంత్రి అమిత్ షా ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు రైతులు అమిత్ షాని కలవనున్నారు. భారత్ బంద్ విజయవంతమైన నేపథ్యంలో వాళ్లను కేంద్ర హోంమంత్రి చర్చలకు ఆహ్వానించడం గమనార్హం. అమిత్ షా తమకు ఫోన్ చేసి, సాయంత్రం 7 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారని రైతు సంఘం నేత రాకేష్ తికాయిత్ చెప్పారు. వివిధ సంఘాల నేతలు ఈ సమావేశానికి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం రైతులు పిలుపునిచ్చిన బంద్‌కు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ, డీఎంకే, టీఆరెస్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ ప్రశాంతంగా ముగిసింది.