వాసన్‌ ఐ కేర్‌ వ్యవస్థాపకుడు అరుణ్‌ కన్నుమూత

వాసన్‌ హెల్త్‌కేర్‌ వ్యవస్థాపకుడు ఏఎం అరుణ్‌ (51) సోమవారం చెన్నైలో కన్నుమూశారు. వాసన్‌ ఐకేర్‌ పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో అందుబాటు ధరల్లో నేత్ర వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన అరుణ్‌ సోమవారం మరణించారు. ఇంటి వద్ద స్పహ తప్పి పడిపోయిన ఆయన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకు వెళ్లే సరికే చనిపోయారు. సహజ మరణంగానే భావిస్తున్నామని వైద్యులు చెప్పారు. అయితే బంధువుల డిమాండ్‌ మేరకు పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తిరుచురాపల్లిలో 60 ఏళ్లుగా నడుస్తున్న ఓ ఔషధ దుకాణాన్ని కొని వైద్య సేవల రంగంలోకి అడుగుపెట్టిన అరుణ్‌ దేశవ్యాప్తంగా 100కు పైగా నేత్ర వైద్యశాలలను స్థాపించే స్థాయికి ఎదిగారు. వాసన్‌ హెల్త్‌ కేర్‌ పేరిట నేత్ర, దంత వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

వాసన్ ఐ కేర్ గ్రూపులో 600 కు పైగా నేత్ర వైద్యులు మరియు దేశవ్యాప్తంగా 100కు పైగా ఆసుపత్రుల్లో 6,000 మంది సిబ్బంది ఉన్నారు. ఈ గ్రూపు 2011లో యుఎస్-ఆధారిత వృద్ధి వ్యూహం మరియు పరిశోధన సంస్థ అయిన ఫ్రాస్ట్ & సుల్లివాన్ ద్వారా అత్యధిక సంఖ్యలో స్టాండ్ ఎలోన్ శస్త్రచికిత్స కేంద్రాలతో ‘ప్రపంచంలోనే అతిపెద్ద కంటి సంరక్షణ ప్రదాత’ అని ధ్రువీకరించబడింది.