అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి: హైకోర్టు

• ఏ కార్యాలయాన్నీ ఇక్కడ నుంచి తరలించకూడదు
• మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలి
• రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు

మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలి, రాజధాని అవసరాలకు తప్ప ఇతరత్రా వాటికి ఆ భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని వివరించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలి. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని తరలించకూడదు అని పేర్కొంది.

గతంలో జరిగిందిదీ….
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ రద్దు చట్టం, మూడు రాజధానుల చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులతోపాటు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్ధనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని ముఖ్యంగా కోరారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్ధకం అవుతాయని, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై వాదనలు ముగిసాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. మార్చి 3న 75 కేసుల్లో వేర్వేరుగా తీర్పు వెలువరించింది.