వైసీపీకి మట్టి మాఫియా ప్రయోజనాలే ముఖ్యమా?

• తాటిపర్తి రైతుల ఆందోళనకు తక్షణం స్పందించాలి
పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని కోదండరాముని చెరువులో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూడటం దురదృష్టకరమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడకు చెందిన మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాల మూలంగా తాటిపర్తి రైతుల పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఇక్కడి మట్టి మాఫియా ఆగడాలను, అభ్యంతరం చెప్పిన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరునీ మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోని వారాహి సభ ద్వారా రాష్ట్రమంతటికీ తెలియచెప్పారు. తాటిపర్తి రైతుల ఆందోళనకు మద్దతుగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం నాయకులు పోరాడటం మొదలుపెట్టారు. రైతుల పక్షాన నిలిచిన జనసేన పార్టీ నాయకులను పోలీసులు, అధికారులు నిలువరిస్తున్న తీరు అప్రజాస్వామికం. కోదండరాముని చెరువులో ఎంత మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారు, ఇప్పటి వరకూ ఎంత తవ్వారు అనే లెక్కలు కూడా అధికారుల దగ్గర లేకపోయినా- మట్టి మాఫియాను వెనకేసుకొని వచ్చేలా మాట్లాడుతున్నారని రైతులు, జనసేన నాయకులు పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ పాలకులకు రైతుల ప్రయోజనాలు పట్టడం లేదని స్పష్టం అవుతోంది. వైసీపీకి మట్టి మాఫియా ప్రయోజనాలే ముఖ్యమని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, పార్టీ నేతలు శ్రీమతి మాకినీడు శేషుకుమారి, శ్రీ తుమ్మల రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పటికే తాటిపర్తి చేరుకొని ఆందోళన చేస్తున్నవారికి బాసటగా నిలిచారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియచేస్తున్నారు. తాటిపర్తి రైతుల వేదనను, మట్టి మాఫియాకి ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తక్షణమే అక్కడ మట్టి తవ్వకాలు నిలిపివేయని పక్షంలో ఈ ఆందోళనను ప్రజాస్వామ్యరీతిలో మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.