నామినేషన్ వేసే సత్తా, దమ్ము కూడా వారికి లేదు: మంత్రి అనిల్

తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపక్షాల మీద దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు వస్తే సత్తా చూపుతామంటూ విపక్ష నేతలు మాట్లాడారని… ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని… ఇప్పుడు ఏమి చేస్తారో చేసుకోండి అంటూ అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో దుమారం రేగుతోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కనీసం 25 శాతం సీట్లయినా సాధించే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. కనీసం నామినేషన్ వేసే సత్తా, దమ్ము కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు. కనీసం 5 శాతం సీట్లను కూడా సాధించలేని కొన్ని తోక పార్టీల మాటల కోటలు దాటుతున్నాయని అన్నారు. నామినేషన్లు వేయడానికి దమ్ము లేదు కానీ ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నేడు కర్నూలులో మీడియాతో మాట్లాడిన మంత్రి రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పూర్తిస్థాయిలో సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కనీసం నామినేషన్ వేసేశక్తి, ధైర్యం లేని పార్టీలు ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పుకుంటున్నాయి అని ఎద్దేవా చేశారు.

నంద్యాల డైరీ ఎన్నికల్లో 80 శాతం ఓట్లతో గెలుపొందామని… పంచాయతీ ఎన్నికల్లో సైతం 80 శాతం సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటుందని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీ సత్తా ఏమిటో చాటుతామని అన్నారు. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్, చైర్మన్ ఎన్నిక విషయంలో గట్టి కృషి చేసి భారీ మెజారిటీతో గెలుపొందేందుకు కృషి చేసిన నంద్యాల పార్లమెంట్ ఎమ్మెల్యేలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ పూర్తి స్థాయిలో సత్తా చాటబోతుందని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి అనిల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. అక్కడ అనిల్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. నామినేషన్ వేయనివ్వకుండా తాము ఎవరినీ అడ్డుకోలేదని.. మీకంటూ ఒక ఛానల్ ఉంది కదా.. మీరు కూడా వెళ్లి నామినేషన్ వేయాలని అనిల్ కుమార్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.