ఇండియాకు మరో పతకం.. రెజ్లర్ భజరంగ్ పూనియాకు కాంస్యం

టోక్యో: అనుకున్నట్లే మెడల్ ఫెవరేట్ భజరంగ్ పూనియా పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్‌లో భజరంగ్ బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. కాంస్య పతకం కోసం సాగిన మ్యాచ్‌లో భజరంగ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 8-0 తేడాతో మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన మ్యాచ్‌లో కజకస్తాన్‌కు చెందిన దౌలత్ నియాజ్‌బెకోవ్‌తో ఇండియన్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా పోటీపడ్డారు. మరో రెజ్లర్ రవికుమార్ దహియా 57 కిలోల విభాగంలో ఇండియాకు సిల్వర్ పతకాన్ని అందించిన విషయం తెలిసిందే.

ఫస్ట్ పీరియడ్‌లో భజరంగ్ మొదట ఓ పాయింట్ సాధించాడు. రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ కొట్టిన దౌలత్‌.. ఈ మ్యాచ్‌లో భజరంగ్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. చాలా టైట్‌గా ఇద్దరూ కుస్తీపడ్డారు. ఫస్ట్ పీరియడ్ ముగింపులో మరో పాయింట్‌ను భజరంగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ పీరియడ్‌లోకి అతనికి 2-0 లీడ్ వచ్చింది.

సెకండ్ పీరియడ్ కూడా రసవత్తరంగా సాగింది. అయితే ఆ పీరియడ్ ఆరంభంలోనే భజరంగ్ రెండు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత వరుసగా రెండేసి పాయింట్లను రెండు సార్లు సాధించిన పూర్తి ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. ఆ పీరియడ్‌లో ఆరు పాయింట్లు గెలిచాడు. భజరంగ్ విక్టరీతో భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. దీంట్లో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి.