తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో మరో పిటిషన్

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఘటనలో 36 మంది చనిపోతే ప్రభుత్వం 11 మందే అని చెబుతోందని తెదేపా నేత పి.ఆర్‌.మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కోర్టుకు తెలిపారు. ఆక్సిజన్ సమయానికి అందకే ఘటన జరిగిందని వాదించారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలన్నారు.

కేంద్రం ఇచ్చిన ఐదు ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం ఇప్పటి వరకు నెలకొల్పలేదని ధర్మాసనానికి న్యాయవాది వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం తిరుపతి ఎస్పీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం తొలిరోజుకు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇదే విషయంపై నిన్న తిరుపతికి చెందిన సామాజిక వేత్త హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.