మిథాలీరాజ్‌ ప్రపంచ రికార్డు.. వన్డేల్లో 7 వేల పరుగులు

భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ ఇటీవల వరుస రికార్డులతో మోతెక్కిస్తోంది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన మిథాలీ… ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో 7 వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా వరల్డ్ రికార్డు నమోదు చేసింది. లక్నోలో దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ ద్వారా ఈ రికార్డును అందుకుంది.

మిథాలీ తన కెరీర్లో ఇప్పటివరకు 213 వన్డేలు ఆడగా, 50.7 సగటుతో మొత్తం 7,008 పరుగులు సాధించింది. వాటిలో 7 శతకాలు, 54 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక, మిథాలీ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించినవారిలో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ చార్లోట్ ఎడ్వర్డ్స్, ఆసీస్ క్రికెటర్ బెలిండా క్లార్క్ ఉన్నారు. చార్లోట్ ఎడ్వర్డ్స్ 5,992 పరుగులు చేయగా, బెలిండా క్లార్క్ 4,844 పరుగులు చేసింది.