Anshu Malik: భారత్‌ మొదటి మహిళా రెజ్లర్‌గా సరికొత్త అధ్యాయం

అన్షూ మాలిక్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ప్రవేశించడం ద్వారా ఈ ఘనత అందుకున్న మొదటి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. నార్వేలో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో రజతం గెలుచుకున్నారు. గురువారం జరిగిన మహిళల 57 కేజీల ఫైనల్లో 20 ఏళ్ల అన్షు ‘బై ఫాల్‌’ పద్ధతిలో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, 2016 రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ హెలెన్‌ లూయిస్‌ మరూలీస్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. తొలి విరామానికి 1- 0తో అన్షు ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో భాగం ఆరంభంలోనే హెలెన్‌ 2 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది.

అనంతరం మరో రెండు పాయింట్లు గెలిచిన హెలెన్‌ తన ఆధిక్యాన్ని 4- 1కు పెంచుకుంది. ఈ దశలో హెలెన్‌ తన పట్టుతో అన్షును కిందకు పడేసి ఆమె రెండు భుజాలను కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు తగిలించి పెట్టింది. దాంతో హెలెన్‌ ‘బై ఫాల్‌’ పద్ధతిలో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. తాజా ఫలితంతో అన్షు రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో రజతం గెలిచిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు గుర్తింపు పొందింది. హర్యానాకు చెందిన అన్సు తండ్రి ధరమ్‌వీర్‌ మలిక్‌ ఒకప్పటి అంతర్జాతీయ రెజ్లర్‌ కావడం గమనార్హం.