అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం.. పలు కీలక అంశాలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. సీఎం జగన్‌తోపాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్, కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ ప్రెస్ మీట్ నిర్వహించి భేటీలో చర్చించిన అంశాలను వెల్లడించారు. సమావేశం ఫలవంతంగా జరిగిందని.. ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించినట్లు ఆయన వివరించారు.

”సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు తమ వాదనలు వినిపించారు. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందించాలని ఇద్దరు సీఎంలను కోరాం. దానికి వారు అంగీకారం తెలిపారు. అన్ని ప్రాజెక్టుల సాంకేతిక అంచనాలను త్వరలోనే నిర్ణయిస్తాం. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులపై చర్చించాం. ఆరేళ్లు దాటినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదు. కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడకు తరలించేందుకు సమావేశంలో అంగీకారం కుదిరింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై నిర్ణయాధికారం కేంద్రానిదే. దాన్ని కేంద్రం త్వరలోనే నిర్ణయిస్తుంది. ట్రైబ్యునల్‌ ద్వారా తెలంగాణకు నీరు కేటాయించాలని కేసీఆర్‌ కోరారు. అవసరమైతే నదీజలాలపై సుప్రీంకోర్టులోని కేసును వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపరమైన అంశాలను పరిశీలించి ముందుకెళ్తాం. నదీజలాల పంపిణీపై రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకుని ట్రైబ్యునల్‌కు పంపిస్తాం. నీటి ప్రాజెక్టులకు అనుమతిచ్చే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌కు ఉంది. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చట్టప్రకారమే ముందుకెళ్తాం. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఆ ప్రాజెక్టుపై బిల్లులు ఇచ్చిన మేరకు నిధులు విడుదల చేశాం. వీలైతే ఈ నెలఖారులో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తా. ఏదాదికి ఒకసారైనా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేలా చూస్తాం” అని గజేంద్రసింగ్‌ షెకావత్ వివరించారు.