ఆ పేరు చెబితే క్రిమినల్స్ గజగజ వణికిపోతున్నారు: రాజ్‌నాథ్ సింగ్

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. యోగి ఆదిత్యనాథ్ పేరు చెబితేనే ఆ రాష్ట్రంలోని క్రిమినల్స్ గజగజ వణికిపోతున్నారని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ నీతినిజాయితీలను ఎవరూ శంకించలేరని వ్యా్ఖ్యానించారు. యూపీలోని మహారాజ్‌గంజ్‌లో ఆదిత్యనాథ్.. ఆధ్యాత్మిక గురువు అవైద్యనాథ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఆధ్యాత్మిక గురువు చూపిన సన్మార్గంలో ఆదిత్యనాథ్ నడుచుకుంటున్నారని అన్నారు. ఓ వైపు సనాతన ధర్మం, మరోవైపు యూపీ రాష్ట్ర బలోపేతానికి ఆయన శ్రమిస్తున్నారని కొనియాడారు. ఒకే సమయంలో రెండు విభిన్నమైన బాధ్యతలను ఆయన అత్యుత్తమంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్న రాజ్‌నాథ్ సింగ్.. ఈ విషయంలో ఆదిత్యనాథ్ విజయం సాధించారని అన్నారు.

అటు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు భారత సేనలను కీలక సూచనలు చేసినట్లు వెల్లడించారు. భారత సేనలు సంయమనంతో వ్యవహరించాలని..అదే సమయంలో ఇతర దేశాలు కవ్విస్తే మాత్రం ధీటుగా సమాధానం చెప్పాలని భారత సేనలకు సూచించినట్లు వెల్లడించారు.

అటు ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇద్దరూ కలిసి దేశ రక్షణను అత్యంత బలోపేతం చేశారంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు.

వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకున్న మంచి ఇమేజ్‌తో యూపీలో మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.