బంగ్లాదేశ్ ప్రధానిపై హత్యా యత్నం కేసు.. 14 మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు మరణశిక్ష..

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను హతమార్చేందుకు యత్నించిన 14 మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు బంగ్లా కోర్టు మరణ శిక్ష విధించింది. 2000 సంవత్సరంలో తన నియోజకవర్గానికి వెళ్లిన ఈమెపై వీరు హత్యాయత్నం చేశారు. ఆ ఏడాది జులై 21 న గోపాల్ గంజ్ లోని కొటాలిపర ప్రాంతంలో వీరు 76 కేజీల బాంబును ఉంచారు. అక్కడ ఎన్నికల ర్యాలీలో హసీనా ప్రసంగించాల్సి ఉండింది. నిషిధ్ధ హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్ సంస్థకు చెందిన వీరందరినీ ఆ తరువాత అరెస్టు చేశారు. వీరిని ఫైరింగ్ స్క్వాడ్ కాల్చి చంపడమే, లేదా ఉరి తీయడమో చేయాలని డాకాలోని స్పీడీ ట్రయల్ ట్రిబ్యునల్ జడ్జి అబూ జాఫర్ మహమ్మద్ పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టుకు చెందిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ శిక్షను ఖరారు చేయవలసి ఉంది. ఈ 14 మందిలో తొమ్మిది మందిని జైలు నుంచిమంగళవారం కోర్టుకు తీసుకువచ్చారు. ఈ కేసులో మరో 5 గురు ఇంకా పరారీలోనే ఉన్నారు.అయితే చట్టం ప్రకారం వీరి తరఫున వాదించడానికి లాయర్లు ఉన్నారు. కాగా ఈ కేసు విచారణ ఇన్నేళ్లు కొనసాగడం విశేషం. పైగా మరణ శిక్ష పడిన నిందితులు కూడా కోర్టులో తమ వాదనలను వినిపించుకునే అవకాశం ఉందని అంటున్నారు.