పింఛన్ల తొలగింపుపై ప్రభుత్వ తీరుకు ఆత్మకూరు జనసేన నిరసన ర్యాలీ

ఆత్మకూరు: సామాజిక పెన్షన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా, జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, గురువారం ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆత్మకూరు మున్సిపల్ ఆఫీస్ వరకు ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది. తదనంతరం ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక పింఛన్లు పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతినెలా ఇచ్చే పింఛన్లను తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు పేదలను ఇబ్బందుల పాలు చేసే విధంగా ఉంది. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు నోటీసులను ప్రభుత్వం జారీ చేసింది. పేదలైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను ఇప్పటివరకు పొందుతున్న పింఛన్లకు దూరం చేయడం కోసమే ఈ నోటీసులు ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిని తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవు. ఈ తరహా నోటీసులు లబ్ధిదారులను వేదనకు గురి చేస్తున్నాయి. పది.. పదిహేను ఏళ్లకు ముందు నుంచి పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులను, నాడు ఇచ్చిన దృపత్రాలను ఇప్పుడు చూపించమని ఒత్తిడి చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? వారి వైకల్యం కళ్ళెదురుగా కనిపిస్తున్నా లబ్ధికి దూరం చేస్తామనటం భావ్యమేనా? జనసేన పార్టీ తరఫున చేపట్టిన జనవాణి కార్యక్రమంలో అనేకమంది దివ్యాంగులు తమకు పింఛన్లు అందడం లేదని, పింఛన్లు రాకుండా రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నారని, వైకల్యాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్లు మంజూరు ఇబ్బందిగా మారిందని వాపోయారు. పింఛన్ల రద్దు నోటీసులపై వాస్తవ పరిస్థితులను తెలియజేస్తుంటే సరిదిద్దకపోగా “తిట్టండి” అని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించాననే భావిస్తున్నారా? అవ్వ.. తాత.. అంటూ 3 వేల పెన్షన్ ఇస్తానని మీరు ఇచ్చిన హామీని ఈ విధంగా అమలు చేస్తారని ఎవరు ఊహించలేకపోయారు. కాలం గడుస్తున్న కొద్దీ పింఛన్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందేలా చూడాలి, అంతేగాని పెన్షన్ మొత్తం పెంచుతున్నాం కాబట్టి లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకోవాలి అనుకోవడం సరికాదు. మీ పాలనలోని ఆర్థిక దివాలా కోరుతనాన్ని కప్పిపుచ్చుకోవటానికే పెన్షన్లు తొలగింపు చేపట్టడం ఏమిటి? సామాజిక పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పింఛన్లు అందించడంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వంశీ, చంద్ర, నాగరాజు, భాను, ఆనంద్, మదన్, అనీల్, తిరుమల, హరిబాబు, దొరబాబు, ప్రసాదు, సందీప్, వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.