బత్తిన హరి రామ్ పై జరిగిన దాడిని ఖండించిన దాసరి రాము

  • కాపు, ఒంటరి, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు జేఏసీ

గూడూరు మండలం, ఆకుమర్రులో జనసేన పార్టీ నాయకులపై జరిగిన దాడిని తెలుసుకొన్న ప్రముఖ కాపు నాయకులు దాసరి రాము గాయపడి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసేన పార్టీ నాయకులను పరామర్శించడం జరిగింది. అనంతరం దాసరి రాము మాట్లాడుతూ అక్రమ మట్టి తవ్వకాన్ని ఆపడాన్ని జీర్ణించుకోలేని వైసిపి నాయకులు జనసేన పార్టీ నాయకులను తాళ్లతో కట్టి జంతువులను కొట్టినట్టు కొట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ఆర్సిపి పార్టీ కాపులను అణిచివేయాలని, తమకు అనుకూలంగా ఉన్న కొందరు ఎస్సి సామాజివర్గానికి చెందిన వ్యక్తుల చేత కాపులపై దాడి చేయించడానికి కాపు సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో జోగి రమేష్ కాపులను ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. దాడికి గురైన వ్యక్తుల శరీరంపై స్పష్టంగా గాయాలు కనపడినప్పటికీ కేసు పెట్టని పోలీసుల వైఖరిని తప్పు పట్టారు. తమ కులస్తులు దళితులను సోదర భావంతో చూస్తారని, దళితులు, బీసీలు కాపులు కలిసి రాజ్యాధికారం దిశగా పయనించాలి తప్ప, మనలో మనం దాడి చేసుకుంటే గతంలో ఏలిన సామాజిక వర్గానికి, ఇప్పుడు ఏలుతున్న సామాజిక వర్గానికి లబ్ధి చేసిన వాళ్ళం అవుతామని సూచించారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక న్యాయవాదిని తాళ్లతో కట్టేసి కొట్టడాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని, దాడి చేసిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వము, పోలీస్ శాఖ వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ఎడల కాపు సంఘాల నుండి ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతామని హెచ్చరించారు.