ఎమ్మెల్యే క్రాంతిపై దాడి.. ఖండించిన హరీష్ రావు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై బీజేపీ నాయకులు దాడి చేయటాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య కాగా, పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని హరీష్‌రావు అన్నారు. దుబ్బాక బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి జితేందర్‌రెడ్డి జిల్లాలో ఉంటే తప్పు కాక పొతే,  జిల్లాకు చెందిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సిద్దిపేటలో ఉంటే తప్పేంటని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. దాడి చేయడానికి 15 ముందే పోలీసులు వచ్చి తనిఖీ చేసుకుని వెళ్లారని హరీష్ రావు వివరించారు. వాళ్ల తనిఖీల సందర్భంగా ఎలాంటి ప్రచార సామాగ్రి దొరకలేదన్నారు. రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, టీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. దాడి చేసిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.

కాగా, తెల్లారితే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ఉందనగా సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. అందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ బస చేసిన హోటల్‌ వద్ద ఆయనకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఒకరి చేతివేలికి గాయమైంది.