ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో చిన్నపాటి ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్‌ భూములను కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనింగ్‌ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ మేరకు ఇళ్లస్థలాలకు మైనింగ్‌ భూమి కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నవరత్నాలు అమలు పై ప్రత్యేక శ్రద్ద పెట్టింది. అందులో భాగంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ దాదాపు 25 లక్షలకు పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఉగాది సందర్భంగా మొదట ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని భావించినా ఆ తరువాత అది జూలై 8 న వైయస్ జయంతి సందర్భంగా చేయడానికి పోస్ట్ పోన్ అయ్యింది.

ఆ తర్వాత మరోమారు న్యాయపరమైన సమస్యలు నేపథ్యంలో ఆగస్టు 15 న నిర్వహించాలని భావిస్తే, మరోమారు గాంధీ జయంతి నాటికి పంపిణీ చేసేలా వాయిదా వేసుకోవలసి వచ్చింది. కోర్టులో ఇళ్ల స్థలాల పంపిణీ కి సంబంధించి పలు అభ్యంతరాలతో కూడిన పిటిషన్లు దాఖలైన నేపథ్యంలోనే న్యాయపరమైన సమస్యలతో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ముందుకు వెళ్లలేకపోతుంది.