ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరు

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరైంది. బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో దాదాపు 21 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ ఖాన్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కుట్ర పూరితంగానే ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు తెలిపారు. మరి అలాంటప్పుడు ఆర్యన్‌ ఏవిధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్‌ దొరికితే.. ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని ప్రశ్నించారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని గతంలోనే కోరారు. ఎన్‌సీబీ తరఫున ఏఎస్‌జీ అనిల్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ఆర్యన్‌ డ్రగ్స్‌ వాడటం తొలిసారేమీ కాదని వాదించారు. డ్రగ్స్‌ విక్రేతలను చాలా సార్లు సంప్రదించాడనీ.. డ్రగ్స్‌ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు తేలిందన్నారు. వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్‌ ఇచ్చింది.