వ్యవసాయ చట్టాలపై బీహారీల నిరసనలు

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై దేశంలో నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. రైతన్నలు చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోంది. తాజాగా, వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ బీహార్‌లో రైతులతో పాటు సాధారణ ప్రజలు సైతం కదం తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలతో హౌరెత్తించారు. వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల డిమాండ్లను పరిష్కరించాలనీ, సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనల్లో రైతులతో పాటు మహిళలు, యువత, వ్యవసాయకార్మికులు, కూలీలు, విద్యార్థు లు, ఉపాధ్యాయులతోపాటు సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి. నిరసనకారులు చేతిలో ప్లకార్డులు, జాతీయ జెండాలు, ఎరుపు, ఆకుపచ్చ జెండాలు, బ్యానర్లు పట్టుకొని నిరసనలు చేశారు. పట్టణాలు, గ్రామీణప్రాంతాలు, జాతీయ, రాష్ట్ర రహదారులు అనే తేడా లేకుండా ప్రతీచోటా రైతులకు మద్దతుగా ఆందోళనలు జరిగాయి. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపమనీ, వాటిని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో రాజకీయ పార్టీల నాయకులు కూడా భాగమయ్యారు. సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్‌), సీపీఐలు మానవహారాల్లో పాల్గొని రైతులకు సంఘీ భావం తెలిపాయి. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సీపీఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్యతో పాటు రాష్ట్రంలో మహాఘట్‌ బంధన్‌కు చెందిన 110 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని ఆందోళనల్లో పాల్గొన్నారు. ” మానవహారం నిరసనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్ల చట్టాలకు ప్రజలు వ్యతిరేకమని ఇది స్పష్టంగా సూచిస్తున్నది” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అవదేశ్‌ కుమార్‌ అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో నిరసనను తీవ్రతరం చేస్తామని సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు కునాల్‌ తెలిపారు.