బాక్సింగ్‌డే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌.. ఆచితూచి ఆడుతోన్న టీమిండియా..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌డే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె(21)తో కలిసి నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన హనుమ విహారి(21; 66 బంతుల్లో 2×4) లైయన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు వారిద్దరూ 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆదివారం 36/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ 61 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మరో మూడు పరుగులకే మూడో వికెట్‌ నష్టపోయింది. కమిన్స్‌ వేసిన 22, 24 ఓవర్లలో శుభ్‌మన్‌గిల్‌(45), పుజారా(17) ఔటయ్యారు. వారిద్దరూ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరారు.

అప్పటి నుంచి జోడీ కట్టిన రహానె, విహారి నిలకడగా ఆడుతూ వికెట్‌ కాపాడుకున్నారు. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి జట్టు స్కోరును 90/3కి తీసుకెళ్లారు. ఇక రెండో సెషన్‌ ప్రారంభమయ్యాక ఈ జోడీ కుదురుకున్నట్లే కనిపించినా లైయన్‌ విడదీశాడు. 45వ ఓవర్‌లో బౌండరీ కొట్టిన విహారి తర్వాతి బంతికే ఔటయ్యాడు. బంతి వేగాన్ని తప్పుగా అంచన వేసిన అతడు వికెట్ల వెనుక గాల్లోకి లేపాడు. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ ఆ క్యాచ్‌ అందుకోవడంతో భారత్‌ 116 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం రహానె, రిషభ్‌ పంత్‌ క్రీజులో ఉండగా టీమిండియా 59 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.