బాక్సింగ్ డే టెస్ట్ … టీంఇండియా బౌలర్ల దాటికి కుప్పకూలిన ఆసీస్

ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు ఆట ముగిసింది….టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా టీంఇండియా బౌలర్ల దాటికి కుప్పకూలింది…ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్‌ అయింది.

టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆసీస్‌ బ్యాటింగ్‌లో వేడ్‌ 48 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హెడ్‌ 38 పరుగులు చేశాడు. భారత బౌలింగ్‌లో బుమ్రా 4, అశ్విన్‌ 3, సిరాజ్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీశాడు.

ఇక తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది..ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రోజును ముగించారు. గిల్‌ 28 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి టీమిండియా తొలి రోజు మూడు సెషన్లలోనూ తన ఆధిపత్యం నిరూపించుకొంది…