మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండచరియలు, 11 మంది మృతి

రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబైలోని చెంబూరులో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతిచెందారు. చెంబూరులోని భరత్‌నగర్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడటంతో 11 మంది మరణించారు. ఈ ఘటనలో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కాగా ఇప్పటివరకు 13 మందిని శిథిలాల నుంచి రక్షించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు క్షతగాత్రులను అధికారులు రాజవాడి, సమీప ఆస్పత్రులకు తరలించారు. కాగా ముంబైలోని విఖ్రోలి, చెంబూర్‌ ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రమాదాలు సంభవించాయి. విఖ్రోలి సూర్యానగర్ ప్రాంతంలో నాలుగు ఇళ్లు కూలిపోయాయి.