ప్రభుత్వ చెరువులను రక్షించలేరా..?: పార్వతీపురం జనసేన

  • జెసిబిలతో చెరువులు చదును చేసి కబ్జా చేస్తున్నారు
  • పార్వతీపురంలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది
  • కనబడిన ప్రతి చెరువును కబ్జా చేస్తున్నారు
  • దేవునిబంధ, నెల్లి చెరువు, లక్ష్ము నాయుడు చెరువు, కామయ్య బంధ, కోదువాని బంధ, లంకెల చెరువు, కొత్త చెరువు, సంగంనాయుడు చెరువు, వరహాల గెడ్డలో జరుగుతున్న కబ్జాలు అడ్డుకోండి.. జిల్లా జాయింట్ కలెక్టర్ తో జనసేన పార్టీ నాయకులు
  • రీ సర్వేలో ఆక్రమణలు తొలగిస్తాం.. అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం… జాయింట్ కలెక్టర్ హామీ

పార్వతీపురం పట్టణంలో కబ్జాకు గురవుతున్న చెరువులను రక్షించలేరా..? అని జనసేన నాయకులు ప్రశ్నించారు. సోమవారం జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ ను జనసేన పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, నీయుగాపుల సురేష్, సిరిపురపు గౌరీశంకర్, మానేపల్లి ప్రవీణ్ తదితరులు కలిసి పార్వతిపురం పట్టణంలో కబ్జాకు గురవుతున్న చెరువులు, వరహాలు గెడ్డ, బందులు తదితర వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం జిల్లా అయినప్పటి నుంచి స్థలాలు విలువ పెరగడంతో పలువురు అక్రమార్కులు, కబ్జాదారులు ప్రభుత్వ చెరువులు, బందలు, గెడ్డలు ప్రభుత్వ స్థలాలపై కన్నేసి దర్జాగా కబ్జా చేస్తున్నారన్నారు. జెసిబి లతో చదును చేసి లారీలు, ట్రాక్టర్లతో మట్టి పోసి దర్జాగా వాటిని కబ్జా చేసి పక్క భవనాలు నిర్మించడం, అమ్మకాలు చేయడం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, మున్సిపాలిటీ, సచివాలయలకు చెందిన అధికారులు సిబ్బంది కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో ఆర్టిఐలో సమాచారం అడిగితే నెలలు గడిచినా ఇంతవరకు అతిగతి లేదన్నారు. ప్రస్తుతం పార్వతీపురం పట్టణంలో దేవునిబంధ, నెల్లి చెరువు, లక్ష్ము నాయుడు చెరువు, కామయ్య బంధ, కోదువాని బంధ, లంకెల చెరువు, కొత్త చెరువు, సంగంనాయుడు చెరువు, వరహాల గెడ్డ తో పలు చెరువులు కబ్జాకు గురవుతున్నాయన్నారు. తక్షణమే కబ్జాలను అడ్డుకోవాలని చెరువులకు హద్దులు నిర్ణయించి, ఆక్రమణలు తొలగించాలని, కబ్జాదారులు, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ మాట్లాడుతూ త్వరలో పార్వతీపురం పట్టణంలో రి సర్వే చేపట్టడం జరుగుతుందని, రి సర్వేలో ప్రభుత్వ చెరువులు, బందలు, గెడ్డలు ప్రభుత్వ స్థలాలు హద్దులు నిర్ణయించి, ఆక్రమణ లు ఉంటే తొలగిస్తామని, ఆక్రమణలకు, కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు.