సముద్ర వీక్షణ లేకుంటే ముఖ్యమంత్రి పరిపాలించలేడా?
* రుషికొండ వద్ద ప్రభుత్వ ఉల్లంఘనలు చాంతాడంత
* ముఖ్యమంత్రికి అసలు ఎన్ని ఇళ్లు కావాలి?
* తెలంగాణలో తరిమి పంపిస్తే ఉత్తరాంధ్ర మీద వైసీపీ నాయకుడు కన్నేశాడు
* విశాఖ రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్
* రుషికొండ పరిశీలనకు పోలీసుల తీవ్ర ఆంక్షలు
‘ప్రభుత్వ భవనం విశాఖ సర్క్యూట్ హౌస్ ముఖ్యమంత్రి నివాసానికి సరిపోదా? ముఖ్యమంత్రికి ఎన్ని ఇళ్లు కావాలి..? సర్క్యూట్ హౌస్ ను అడ్డగోలుగా తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు రుషికొండ మీద కన్నేశారు. ఈయన పరిపాలించడానికి మంచి సముద్రపు వీక్షణ ఉన్న ప్రాంతం కావాలా? సముద్రపు వీక్షణ లేకపోతే పరిపాలించలేరా?’
అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రుషికొండను అడ్డగోలుగా తవ్వేసి అక్కడ ఇష్టానుసారం భవనాలు నిర్మిస్తున్న ప్రదేశాన్ని శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ పరిశీలనలో పాల్గొన్నారు. పర్యావరణ నిబంధనలను పూర్తిగా కాలరాసి నిర్మిస్తున్న భవనాల తీరును ఆయన మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా మీడియా వ్యాన్ ఎక్కి స్వయంగా మీడియా మిత్రులతో కలిసి రుషికొండ చుట్టూ ఎత్తయిన భారీ షీట్స్ వేసి లోపల చేస్తున్న భారీ భవంతుల నిర్మాణాలను ఆయన పరిశీలించి అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వైసీపీ నాయకుడు తెలంగాణలో ఇలా దోపీడీ చేస్తేనే అక్కడ నుంచి తన్ని తరిమేశారు. ఇప్పుడు ఆయన కన్ను ఉత్తరాంధ్ర మీద పడింది. ఇక్కడి ప్రకృతి వనరుల మీద పడింది. నిబంధనలు, చట్టాలు పాటించాల్సిన పెద్ద మనిషి వాటిని తుంగలో తొక్కి అడ్డగోలుగా రుషికొండను తవ్వేసి మరీ భవనాలు నిర్మిస్తున్నారు. రుషికొండ విధ్వంసాన్ని మీడియా కూడా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. వారిని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ చెబుతున్నా, కోర్టులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రుషికొండకు పూర్తిగా గుండు కొట్టి మరీ భవనాలు నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి భవనానికి రుషికొండే కావాలా..? విశాఖలో బోలెడు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు కదా..!
* ప్రకృతి వనరులు మింగేస్తున్న పెద్ద మనిషి
ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న పెద్ద మనిషి వాటిని మింగేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి దారుణమైన నాయకుడు బహుశా దేశంలో ఎక్కడా ఉండడు. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలు చాలా పెద్దవి. ప్రకృతి వినాశనానికి సీఎం పాల్పడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజలకి చూపించాలి అనేదే మా ఆకాంక్ష. దీనిపై ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్టుల్లో సైతం చిన్న చిన్న ఉల్లంఘనలు జరిగాయని వైసీపీ నేతలు ఒప్పుకున్నారు. చిన్నపాటి ఉల్లంఘనలు అంటే ఇక్కడ చాంతాడంత ఉల్లంఘనలు జరుగుతున్నాయి.
* ఏ రాజధానీ లేదు
మూడు రాజధానులు అన్న పెద్దమనిషి రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా చేశారు. న్యాయ రాజధాని అన్న కర్నూలులో కనీసం ఉపలోకయుక్తను కూడా నియమించలేక పోయారు. ఇలాంటి మోసం చేసే వ్యక్తికి ప్రజలు అధికారం కట్టబెట్టారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా ఆలోచించాలి” అన్నారు. ఈ పర్యటనలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్య, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్, పార్టీ నేతలు సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు, పి.వి.ఎస్.ఎన్.రాజు, పంచకర్ల సందీప్, శ్రీమతి పి.ఉషాకిరణ్, వి.గంగులయ్య, శ్రీమతి భీసెట్టి వసంత లక్ష్మి, పీతల మూర్తి యాదవ్, దల్లి గోవింద రెడ్డి, కందుల నాగరాజు, శ్రీమతి లోకం మాధవి తదితరులు పాల్గొన్నారు.