వ్యాక్సిన్‌ ఉత్పత్తి మరియు ధర అంశాలపై మూడు రోజుల్లోగా సమగ్ర నివేదికకోరిన కేంద్రం

ఆగస్ట్ 15న ప్రధాని మోదీ కోవిడ్-19కు వ్యాక్సిన్‌ సిద్ధమైన వెంటనే త్వరగా దేశ ప్రజలందరికీ అందిస్తామని ఎర్రకోట పైనుంచి ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలి అడుగు వేసింది. కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోనే దిశగా ముందుకు సాగుతూ టీకా తయారు చేస్తున్న ఐదు కంపెనీల అధికారులతో సంప్రదింపులు ప్రారంభించింది. ‘‘టీకాను ఎప్పటిలోగా పెద్దఎత్తున ఉత్పత్తి చేయగలరు? ఒకవేళ దానికి ఆమోదం లభిస్తే.. టీకాకు ఎంత ధర ఉండాలని మీరు భావిస్తున్నారు. ఈ అంశాలపై మూడు రోజుల్లోగా సమగ్ర నివేదికను సమర్పించండి’’ అని క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలాతోపాటు వ్యాక్సిన్‌ రేసులో ఉన్న బయోలాజికల్‌ ఈ, జెన్నోవా కంపెనీలను కోరింది. వీటిలో రెండు హైదరాబాద్‌ కంపెనీలే కావడం గమనార్హం. అమెరికా, బ్రిటన్‌ సహా పలు అభివృద్ధి చెందిన దేశాల కంపెనీలు ఇప్పటికే వ్యాక్సిన్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటు తయారైన వెంటనే తమకు ఇన్ని టీకాలు కావాలంటూ ఆర్డర్లు ఇస్తున్నాయి.

ఇప్పటివరకూ భారత్‌ మాత్రం ఇప్పటి వరకూ ఏ కంపెనీతోనూ ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఈ నేపథ్యంలోనే, టీకా తయారు చేయడానికి ఓవైపు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అదే సమయంలో, వ్యాక్సిన్‌ సిద్ధమైన తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా అందరికీ అందించే ఏర్పాట్లను మేం చేస్తున్నాం. కొవిడ్‌కు సంబంధించి జనవరి నుంచీ భారత్‌ ముందు జాగ్రత్త చర్యగా, దశలవారీగా ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే, ఉత్పత్తి కంటే ముందే కంపెనీలతో నిపుణుల బృందం చర్చలు జరుపుతోంది. సిద్ధమైన వెంటనే ప్రజలకు అందించడానికి ధర, పంపిణీ తదితరాలపై సంప్రదింపులు జరుపుతోంది’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌ చెప్పారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని నిపుణుల బృందం ఆయా కంపెనీల ప్రతినిధులను కోరింది.