Sudan Protest: అధికారం చేజిక్కించుకున్న ఆర్మీ

సూడాన్‌ మిలిటరీ సోమవారం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తాత్కాలిక ప్రధాని హమ్‌దోక్‌ను, ఇతర అధికారులను అరెస్టు చేసిన కొద్దిగంటల తర్వాత తాత్కాలిక పౌర ప్రభుత్వాన్ని రద్దు చేశారు. సైనిక కుట్రను నిరసిస్తూ వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యం దిశగా తడబడుతూ అడుగులు వేస్తున్న దేశ ప్రగతికి ఈ కుట్ర పెద్ద ముప్పుగా పరిణమించింది. దీర్ఘకాల నియంత ఒమర్‌ అల్‌ బషీర్‌ను పదవీచ్యుతుని చేసిన రెండేళ్ళ తర్వాత, ప్రభుత్వానికి మిలటరీ అధికారాన్ని బదిలీ చేయడానికి కొద్ది వారాల ముందుగా సైనిక కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సోమవారం తెల్లవారు జామునే ప్రధానిని, ఇతర అధికారులను అరెస్టు చేశారు.

ఇది తెలిసిన వెంటనే రాజధాని ఖార్టూమ్‌ వీధుల్లోకి వేలాదిమంది వచ్చారు. వీధులను దిగ్బంధిస్తూ, టైర్లకు నిప్పు పెడుతూ వారు ఆందోళనలు చేశారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. పెద్ద ఎత్తున గాల్లోకి పొగ కమ్ముకుంది.

‘ప్రజలు బలవంతులు’ ‘తిరోగమనం ఒక అవకాశం కాదు’ అంటూ ఆందోళనకారులు నినదించారు. నైలు నదిపై వంతెనలు దాటి రాజధానిలోకి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. ప్రదర్శనల్లో 12మంది ఆందోళనకారులు గాయపడ్డారు. ప్రభుత్వాన్ని, సార్వభౌమత్వ మండలిని రద్దుచేస్తున్నట్లు మధ్యాహ్నం మిలటరీ హెడ్‌ జనరల్‌ అబ్దుల్‌ ఫత్తా బుర్హాన్‌ టివిలో ప్రకటించారు.

అమెరికా, ఇతర పశ్చిమదేశాలకు గులాం గిరీ చేసే అధ్యక్షుడు అల్‌ బషర్‌ను పదవీచ్యుతుని చేసిన తర్వాత నాలుగు నెలలకు సైన్యం, పౌర సంస్థలు కలసి సార్వభౌమత్వ మండలిని ఏర్పాటు చేశారు. సైన్యం పౌర సంస్థల ప్రతినిధులను పక్కకు నెట్టి విదేశాంగ విధానంలోను, రాజకీయ వ్యవహారాల్లోను పెత్తనం చలాయించడంతో మొదలైన విభేదాలు సైనిక కుట్రతో పరాకాష్టకు చేరాయి. సైనిక తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్న మిలిటరీ అధికారుల ముఠా దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటంచింది. 2023 జులైలో జరగాల్సిన ఎన్నికల దిశగా దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సైన్యం ప్రకటించింది. మిలటరీనే ఇన్‌చార్జిగా వుంటుందని ఆర్మీ జనరల్‌ తెలిపారు.