వాత్సల్య దరఖాస్తుదారులకు సర్టిఫికెట్లు ఇంటి వద్దకే అందజేయాలి: జనసేన డిమాండ్

  • సచివాలయాల్లో సర్టిఫికెట్లకు ముప్పుతెప్పలు
  • సచివాలయాల వలన అదనపు భారం
  • ఉన్నతాధికారులు స్పందించాలన్న జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన దరఖాస్తుదారులకు అవసరమైన సర్టిఫికెట్లను ఇంటి వద్దకే అందజేయాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు గొర్లి చంటి, వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, బంటు షరీఫ్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మిషన్ వాత్సల్య పథకాన్ని ఐసిడిఎస్ అధికారులు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటన చేశారన్నారు. ఈ ప్రకటనలో భాగంగా తల్లి, తండ్రి లేదా తల్లిదండ్రులు లేని అభాగ్యులు, అనాధలు, పేదలైన పిల్లలకు రూ.4,000 లు ఇస్తారని ఈ నోటిఫికేషన్ సారాంశం అన్నారు. అయితే వాత్సల్యకు దరఖాస్తు చేసుకోవాలంటే మృతి చెందిన తల్లి లేదా తండ్రి తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్, పిల్లల బర్త్ సర్టిఫికెట్, జాయింట్ అకౌంట్, స్టడీ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తదితర సర్టిఫికెట్ లు ఉండాలని సంబంధిత అధికారులు నోటిఫికేషన్లలొ పేర్కొన్నారన్నారు. ఆయా సర్టిఫికెట్లకు అర్హులైన వారు సచివాలయానికి వెళితే ముప్పు తుప్పలు పెడుతున్నట్లు దరఖాస్తుదారులు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల ద్వారా అవసరమైన సేవలు ఇంటి వద్దకే అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు అవి కేవలం ప్రకటనకే పరిమితం అయ్యాయన్నారు. దరఖాస్తుదారులు సచివాలయం వద్ద ఆయా సర్టిఫికెట్లకు దరఖాస్తు చేస్తే అక్కడనుండి కష్టాలు ఆరంభం అవుతున్నాయన్నారు. సర్టిఫికెట్ల జారీలో కీలక పాత్రధారులైన వీఆర్వోలు దొరకడం గగనమవుతుందన్నారు. అంతేకాకుండా సచివాలయంలో దరఖాస్తు చేసి ఎప్పటిలాగే పాత పద్ధతిలో విఆర్ఓ, ఆర్ఐ, తాసిల్దార్ వద్దకు పరుగులెత్తాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం లేటు భర్త్, డెత్ సర్టిఫికెట్లకు ఆర్డిఓ ఆఫీసుకు కూడా పరుగులు తీసే పరిస్థితి ఉందన్నారు, పేద, కూలి బతుకులతో నిర్లక్ష్యరాస్యులైన దరఖాస్తుదారులు రోజుల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరగటం, సంబంధిత అధికారులు దొరకకపోవడం, ఏ ఫారం ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ పెట్టాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియక దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఆయా సర్టిఫికెట్లకు నేరుగా తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి ప్రజలు చేయించుకునే వారన్నారు ఇప్పుడు అదనంగా సచివాలయాలు రావడంతో దరఖాస్తు చేసుకునేటప్పుడు ఒకసారి వెళ్ళటం, మళ్లీ తాసిల్దార్, ఆర్డీవో కార్యాలయాల పనులు పూర్తయ్యాక మళ్ళీ సర్టిఫికెట్లు తీసుకునేందుకు మరోసారి వెళ్లడం వలన సచివాలయాలు అదనపు భారంగా తయారయ్యాయన్నారు. అంతేగాని ఈ విషయంలో సచివాలయాల వలన ప్రయోజనం లేదని దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారన్నారు. కాబట్టి తక్షణమే సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మిషన్ వాత్సల్య దరఖాస్తుదారులకు వాలంటీర్ల ద్వారా అవసరమైన సర్టిఫికెట్లు ఇంటి వద్దకే అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.