ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు చిరంజీవి సినిమాలో ఛాన్స్ ?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో చిరుతో పాటు ఓ కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 ఫినాలేకు గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో చాలా జాలీగా ముచ్చటించారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన మెహబూబ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. కాగా తన నెక్ట్స్ చిత్రంలో మెహబూబ్‌కు ఓ అవకాశం ఇవ్వాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆచార్య చిత్రంలో ఓ చిన్న పాత్ర కోసం మెహబూబ్‌కు అవకాశం ఇవ్వాలని దర్శకుడు కొరటాల శివను చిరంజీవి కోరినట్లు తెలుస్తోంది. దీనికి కొరటాల కూడా వెంటనే ఓకే అనేశారని, త్వరలోనే మెహబూబ్‌కు ఈ సినిమాలో ఓ ఛాన్స్ దక్కడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ ఇది నిజమైతే మెహబూబ్‌కు అదృష్టం కలిసొచ్చినట్లే అంటున్నారు ప్రేక్షకులు. బిగ్‌బాస్ 4లో తనకంటూ మంచి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న మెహబూబ్, టాప్-5కి రాకముందే ఎలిమినేట్ అయ్యాడు. అయితే సోహెల్‌తో ఉన్న మంచి స్నేహం కారణంగా మెహబూబ్ అంటే కూడా ప్రేక్షకుల్లో క్రేజ్ మరింత పెరిగింది. మరి ఆచార్య చిత్రంలో నిజంగానే మెహబూబ్ కనిపిస్తాడా అనేది చూడాల్సి ఉంది.