చెన్నై టెస్టు: ముగిసిన రెండో రోజు ఆట… ఇంగ్లండ్ 555/8

చెన్నైలో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 555 పరుగులు చేసింది. డామ్ బెస్ (28), జాక్ లీచ్ (6) క్రీజులో ఉన్నారు.

ఇవాళ్టి ఆటలో కూడా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిన్న సెంచరీ సాధించిన రూట్ ఇవాళ డబుల్ సెంచరీ సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు. మొత్తం 218 పరుగులు చేసిన రూట్ తన సూపర్ ఫామ్ చాటుకున్నాడు. రూట్ కు ఇది 100వ టెస్టు మ్యాచ్ కాగా, 100వ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడు రూట్ తప్ప మరొకరు లేరు.

చెన్నై చెపాక్ స్టేడియంలో అన్ని వైపులా క్రికెటింగ్ షాట్లు ఆడిన రూట్ భారత బౌలర్లకు దాదాపు రెండ్రోజుల పాటు కొరకరాని కొయ్యలా పరిణమించాడు. చివరికి లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ రౌండ్ ద వికెట్ వచ్చి బౌలింగ్ చేయడంతో రూట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రూట్ భారీ ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, 2 సిక్సులున్నాయి.

అటు, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా ధాటిగా ఆడాడు. స్టోక్స్ 118 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 82 సాధించాడు. భారత బౌలర్లలో ఇషాంత్, బుమ్రా, అశ్విన్, నదీమ్ తలో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్ కు వికెట్లేమీ దక్కలేదు. కాగా, ఈ ఇవాళ్టి ఆటలో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ… సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్ ను తలపించేలా ఆఫ్ స్పిన్ వేసి అందరినీ అలరించాడు.