దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్మోహన రెడ్డి

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల‌ సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం
తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. తాడేపల్లి లోని సియం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ముఖ్యమంత్రి దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

ఇంద్రకీలాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సామినాయుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఆలయ ఈఓ డి. భ్రమరాంబ. స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు,ఆలయ ప్రధానార్చకులు,ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్థానాచార్యులు వి.శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చక ఎల్.దుర్గాప్రసాద్ ముఖ్యమంత్రికి పరివేష్టితం ధారణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. బధ రీనాథ్, ఉప ప్రధాన అర్చకులు కె.రవికుమార్, బి.శంకర శాండిల్య, శ్రీనివాస స శాస్త్రి ముఖ్యమంత్రి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు.

సరస్వతీ దేవి అలంకారంలో వుండి భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని సాంప్రదాయ వస్త్రధారణతో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతరాలయంలో ఆలయ ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వాచన మండపంలో చింతపల్లి ఆంజనేయ ఘనాపఠి, వి.రామనాధ్ ఘనాపఠి, టి.వెంకటేశ్వరరావు ఘనాపఠి, వేదపండితులు ఆర్.వి.సోమయాజులు, కె.నరసింహమూర్తి, అర్చక కె.గోపాలకృష్ణలు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.